Googl: చేతులు కలిపిన గూగుల్, యాపిల్: కరోనా కట్టడికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామని ప్రకటన

  • బ్లూటూత్ సాంకేతిక పరిజ్ఞానం కోసం కృషి
  • 'కాంట్రాక్ట్ ట్రేసింగ్' సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు
  • దీనివల్ల బాధితులు ఎవరెవరిని కలిశారో తెలుస్తుంది
google and apple try to make device for contract tracing

ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలు గూగుల్‌, యాపిల్‌లు చేతులు కలుపుతున్నాయి. ప్రపంచాన్ని కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో తమవంతు ప్రయత్నంగా ఉమ్మడి కృషితో బ్లూటూత్ వంటి సాంకేతికతను కనుగొంటామని ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. కరోనా విస్తరణలో ప్రధాన సమస్య అసలు తమకు వైరస్ సోకిందని బాధితులకే తెలియక పోవడం.

సాధారణంగా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించాక 14 నుంచి 20 రోజుల తర్వాతే దాని ప్రభావం కనిపిస్తుంది. ఈలోగా సదరు బాధితుడు కొన్ని వందల మందిని కలిసే అవకాశం ఉంది. ఎన్నో ప్రాంతాలకు తిరగొచ్చు. ఈ కారణంగా అతని ప్రయాణ మార్గాలు, తిరిగిన ప్రదేశాలు, కలిసిన వ్యక్తులకు ప్రమాదం పొంచివున్నట్టే. ఒకవేళ బాధితుడిని గుర్తించినా అతను ఎవరెవరిని కలిశారన్న 'కాంట్రాక్ట్ ట్రేసింగ్'ను కనుగొనడమే పెద్దపని. ఈ పనిని సులువు చేసేందుకు ప్రయత్నిస్తామని చెబుతున్నారు.

ఇందుకోసం అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ (ఏపీఏ), ఆపరేటింగ్ సిస్టమ్-లెవల్ సాంకేతిక అంశాల ఆధారంగా సమస్యకు పరిష్కారం చూపుతామని రెండు సంస్థలు ప్రకటించాయి. ఇందుకోసం ప్రజారోగ్య సంస్థల యాప్ లను ఉపయోగించి ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ లను సమన్వయ పరుస్తామని, మే నెలలో ఏపీఐలను విడుదల చేస్తామని తెలిపాయి.

దీని ఆధారంగా రాబోయే నెలల్లో సమగ్రమైన బ్లూటూత్ ఆధారిత 'కాంట్రాక్ట్ ట్రేసింగ్' సిస్టమ్ ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో వ్యక్తుల గోప్యతకు, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు రెండు సంస్థలు ప్రకటించడం విశేషం.

More Telugu News