Nara Lokesh: ఆందోళనలో ఉన్న రైతాంగాన్ని యుద్ధప్రాతిపదికన ఆదుకోవాలి: టీడీపీ నేత నారా లోకేశ్‌

  • రైతన్న సర్వం కోల్పోయి పొలంలో కన్నీరు పెడుతున్నాడు
  • జగన్‌  గారు మాత్రం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు
  • పంట నష్టాన్ని అంచనా వేసి నష్ట పరిహారం చెల్లించాలి
lokesh fires on ycp leaders

రైతుల సంక్షేమంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ దృష్టి పెట్టడం లేదని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. 'ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్న సర్వం కోల్పోయి పొలంలో కన్నీరు పెడుతుంటే జగన్‌  గారు మాత్రం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ ఒకపక్క, అకాల వర్షాలు మరోపక్క రాష్ట్ర రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి' అని పేర్కొన్నారు.

'గిట్టుబాటు ధర లేక, కనీసం రవాణా సౌకర్యం లేక రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, పెసర, మిర్చి, అరటి, మామిడి,కొబ్బరి, నిమ్మ, ద్రాక్ష తదితర పంటలు, ఆక్వా రంగంలో ఉన్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది' అని చెప్పారు.

'తక్షణమే ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి నష్ట పరిహారం చెల్లించాలి. ఆందోళనలో ఉన్న రైతాంగాన్ని యుద్ధప్రాతిపదికన ఆదుకోవాలి' అని జగన్‌ను లోకేశ్‌ డిమాండ్ చేశారు. కాగా, ఇటీవల కురిసిన వర్షాలకు ఏపీలోని పలు ప్రాంతాల్లో రైతులు పెద్ద మొత్తంలో పంటను నష్టపోయిన విషయం తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో మార్కెట్లో తమ పంటల ఉత్పత్తులను అమ్ముకోలేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేశ్‌ ట్విట్టర్‌లో ఈ పోస్టులు చేశారు.

More Telugu News