లాక్ డౌన్ పై మోదీ ఈ రోజు స్పష్టమైన ప్రకటన చేస్తారు: కిషన్‌ రెడ్డి

11-04-2020 Sat 11:45
  • సీఎంలతో సమావేశం ముగిసిన వెంటనే ప్రకటన
  • లేదంటే ఈ రోజు రాత్రి మోదీ ప్రకటన చేస్తారు
  • ప్రజలకు నచ్చజెప్పే పని మోదీకి మాత్రమే సాధ్యం
  • లాక్‌డౌన్‌ పొడిగించాలని మేము చెప్పాం.. అందరూ ఇదే చెబుతున్నారు 
Kishan Reddy Face To Face Over Lockdown

లాక్‌డౌన్‌ పొడిగించాలని అందరూ అడుగుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఈ రోజు రాత్రి ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు.

'దేశంలో కరోనా మూడో దశకు చేరలేదు. ఒకవేళ చేరితే ఇబ్బందులు వస్తాయి. ఇంకా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. మాస్కులు లేకుండా బయటకు రావద్దని నిబంధనలు విధిస్తున్నాయి. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో మరిన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల వద్దకే నిత్యావసర సరుకులు చేర్చుతున్నాయి. రోడ్డు మీదకు రావద్దని చెబుతున్నాయి' అని తెలిపారు.

'ఈ సమయంలో మనమందరం బాధ్యతతో ఇంట్లోనే ఉండాలి. అలా అయితేనే కరోనాను కట్టడి చేయగలం. లాక్‌డౌన్‌ కొనసాగించే అంశంపై మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, వివిధ పార్టీల నేతలు, ముఖ్యమంత్రులతో మోదీ మాట్లాడుతున్నారు. ఈ రోజు మరోసారి అన్ని రాష్ట్రాల సీఎంలతో మరోసారి మాట్లాడతారు' అని తెలిపారు.

'డబ్ల్యూహెచ్‌వో సూచనలు కూడా మోదీ తీసుకుంటున్నారు. సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడి అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నారు. అనేక మంది మేధావులతో మాట్లాడుతున్నారు. వ్యాపార సంఘాల అభిప్రాయాలు తీసుకున్నారు. ఓ నిర్ణయానికి వస్తారు' అని కిషన్‌ రెడ్డి అన్నారు.

'సీఎంలతో సమావేశం ముగిసిన వెంటనే లేక ఈ రోజు రాత్రి మోదీ ఓ స్పష్టమైన ప్రకటన చేస్తారు. ప్రజలకు నచ్చజెప్పే పని మోదీకి మాత్రమే సాధ్యం. జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. లాక్‌డౌన్‌  పొడిగించాలని మేము కూడా చెప్పాం.. అందరూ ఇదే చెబుతున్నారు' అని తెలిపారు.

'ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదు.. పొడిగించాలనే అందరికీ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు, రైతు కూలీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యవసాయ పనులకు సంబంధించి ఎటువంటి నిబంధనలు లేవు. అన్ని పనులు చేసుకోవచ్చు' అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.