Maharashtra: లాక్‌డౌన్‌లో విహారానికి.. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లపై కేసు నమోదు!

Case filed against DHFL promoters for violating lockdown
  • యస్ బ్యాంకు కుంభకోణంలో డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లపై ఆరోపణలు
  • నిబంధనలు ఉల్లంఘించి మహాబలేశ్వర్ పర్యటన
  • మహారాష్ట్రలో రాజకీయ దుమారం
లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి పర్యాటక ప్రదేశాన్ని సందర్శించిన డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు, వారి కుటుంబ సభ్యులు 21 మందిపై కేసులు నమోదయ్యాయి. యస్ బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కపిల్ వాద్వాన్, ధీరజ్ వాద్వాన్ సహా వారి కుటుంబ సభ్యులందరూ కలిసి పూణె జిల్లాలోని ఖండాలా నుంచి సతారా జిల్లాలోని మహాబలేశ్వర్‌కు వెళ్లారు. వీరి సందర్శనకు మహారాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అమితాబ్ గుప్తా అనుమతి లేఖను ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉండడంతో పూణె, సతారా జిల్లాలు దిగ్బంధంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరు పర్యటనకు వెళ్లడం కలకలం రేపింది.

వారి పర్యటనకు హోంశాఖ సీఎస్ అనుమతి ఇవ్వడంపై బీజేపీ నిప్పులు చెరిగింది. వాద్వాన్ సోదరులు ఎన్సీపీ చీఫ్ శరద్‌ పవార్‌కు ఆప్తులు కావడం వల్లే అనుమతి లభించిందని బీజేపీ ఆరోపించింది. స్పందించిన ప్రభుత్వం సీఎస్ అమితాబ్ గుప్తాను సెలవుపై పంపినట్టు పేర్కొంది. మరోవైపు కపిల్, ధీరజ్ సహా మొత్తం 21 మందిపై కేసులు నమోదు చేసినట్టు మహాబలేశ్వర్ పోలీసులు తెలిపారు. కాగా, ఈ పర్యటనలో వారు ఉపయోగించిన ఐదు లగ్జరీ కార్లను సీజ్ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు. లాక్‌డౌన్, కరోనా నెపంతో వాద్వాన్ సోదరులు విచారణకు హాజరు కావడం లేదని ఈడీ అధికారులు పేర్కొన్నారు.
Maharashtra
Mahabaleshwar
Lockdown
DHFL

More Telugu News