బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ‘చైనా వైరస్ గో బ్యాక్’ నినాదాన్ని ఖండించిన చైనా

11-04-2020 Sat 08:22
  • ‘చైనీస్ వైరస్ గో బ్యాక్’ అని నినదించిన రాజాసింగ్
  • ఖండిస్తూ లేఖ రాసిన చైనా
  • బదులిచ్చిన రాజాసింగ్
China reacts on BJP MLA Raja singh slogans

‘చైనీస్ వైరస్ గో బ్యాక్’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన నినాదాలపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు రాజాసింగ్‌కు ఓ లేఖ రాసింది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ నెల 5న ధూల్‌పేటలో రాజాసింగ్ జ్యోతిని వెలిగించారు.

ఈ సందర్భంగా ‘చైనా వైరస్ గో బ్యాక్’ అని నినదించారు. ఆయన వ్యాఖ్యలపై భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం తీవ్రంగా స్పందించింది. కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలిపిన తొలి దేశం చైనా అని, అంతమాత్రానికి ఆ వైరస్ చైనాలో పుట్టినదని కాదని పేర్కొంటూ భారత్‌లోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కౌన్సిలర్ (పార్లమెంటు) లియూ బింగ్ రాజాసింగ్‌కు లేఖ రాశారు.

చైనా వైరస్ గో బ్యాక్ అంటూ చేసిన నినాదాలను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ లేఖపై రాజాసింగ్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వైరస్‌ను చైనా వైరస్ అనే అన్నారని గుర్తు చేశారు.