Pawan Kalyan: ఎన్నికల కమిషనర్ ను తొలగించడానికి ఇదా సమయం?: పవన్ కల్యాణ్

  • ప్రత్యేక ఆర్డినెన్స్ తో ఎస్ఈసీ తొలగింపు
  • ఇది కక్ష సాధింపు చర్య అంటూ పవన్ విమర్శలు
  • హైకోర్టు చీవాట్లు పెట్టినా మార్పు రాలేదంటూ వ్యాఖ్యలు
Pawan questions AP Government over sec row

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా తొలగించడం పట్ల ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ కూడా స్పందించారు.

దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి రాజకీయాలేంటని మండిపడ్డారు. ఓవైపు కరోనా మహమ్మారి ధాటికి ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు, ఎన్నికల కమిషనర్ ను తొలగించడానికి ఇదా సమయం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ మొండి వైఖరి కనబరుస్తోందని విమర్శించారు.

కీలక అంశాల్లో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉంటున్నాయని, పలుమార్లు హైకోర్టు చీవాట్లు పెట్టినా, 'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు' అన్నట్టు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కరోనా వేగంగా విస్తరిస్తున్న సమయంలో ఎన్నికలు జరిపి ఉంటే ప్రజల ప్రాణాలకు ఎంత ప్రమాదం వాటిల్లేదో ఊహించగలమా! అన్నారు. ప్రజలను కాపాడడంపై దృష్టి కేంద్రీకరించాల్సిన వేళ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని పవన్ కల్యాణ్ హితవు పలికారు.

More Telugu News