IIT Ropar: కూరగాయలు, కరెన్సీ నోట్లను శుద్ధి చేసే సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించిన ఐఐటీ రోపార్

  • ట్రంకు పెట్టె ఆకారంలో పరికరాన్ని రూపొందించిన నిపుణులు
  • అల్ట్రావయొలెట్ ఇర్రేడియేషన్ టెక్నాలజీ వినియోగం
  • ధర రూ.500 కంటే తక్కువే!
IIT Ropar invents trunk shaped sanitiser

ఇప్పుడు ఎక్కడ చూసినా పరిశుభ్రత గురించే మాట్లాడుతున్నారు. చేతులు తరచుగా కడుక్కోవడం, వ్యక్తులకు భౌతికదూరం పాటించడం వంటి అంశాలు సర్వసాధారణం అయ్యాయి. దీనికంతటికీ కారణం కరోనా వైరస్! కరోనా వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారికి, వారు ఉపయోగించిన వస్తువులను తాకిన వారికి ఈ వైరస్ సులువుగా సోకుతుంది. ఈ నేపథ్యంలో, ఐఐటీ రోపార్ ఓ అద్భుత పరికరాన్ని రూపొందించింది. దీంట్లో కూరగాయలు, కరెన్సీ నోట్లు, సెల్ ఫోన్లు, ఇతర వస్తువులను ఉంచితే వాటిని ఆ పరికరం కరోనా రహితంగా మార్చేస్తుంది.

చూడ్డానికి ఇదో ట్రంకు పెట్టెలా కనిపిస్తుంది. దాంట్లో అల్ట్రా వయొలెట్ జెర్మిసైడల్ ఇర్రేడియేషన్ టెక్నాలజీ వినియోగించారు. ఇందులో మనం శుభ్రపరచాల్సిన వస్తువులను ఉంచితే అల్ట్రావయొలెట్ కిరణాలు ప్రసారం అవుతాయి. తద్వారా ఆ వస్తువులపై ఉన్న క్రిములు నాశనం అవుతాయి. కూరగాయలను వేడినీటిలో కడిగి శుభ్రం చేసుకోవచ్చు కానీ, కరెన్సీ నోట్లు, సెల్ ఫోన్లను ఆ విధంగా చేయలేం. అలాంటి పరిస్థితుల్లో ఈ ట్రంకు పెట్టె పరికరం అద్భుతంగా పనిచేస్తుంది.

దీంట్లో ఒకసారి వస్తువులను ఉంచి శానిటైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత 30 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఆ తర్వాత దీనికి 10 నిమిషాల విశ్రాంతి (కూలింగ్ పీరియడ్) ఇచ్చి తిరిగి ఉపయోగించుకోవచ్చని ఐఐటీ రోపార్ నిపుణులు చెబుతున్నారు. వాణిజ్యపరంగా ఈ ట్రంకు పెట్టె పరికరం అందుబాటులోకి వస్తే దీని ఖరీదు రూ.500 కన్నా ఎక్కువ ఉండదని అంటున్నారు. దీన్ని ఆన్ చేసిన తర్వాత ఎవరూ లోపలికి చూడరాదని, దీంట్లో ప్రమాదకర అతినీలలోహిత కిరణాలు ప్రసరిస్తుంటాయని ఐఐటీ రోపార్ నిపుణులు తెలిపారు.

More Telugu News