icmr: దేశంలో కొవిడ్‌-19 సామాజిక వ్యాప్తి జరిగే అవకాశముంది: ఐసీఎంఆర్‌ ఆందోళన

  • తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలున్న వారిపై పరిశోధన
  • ఫిబ్రవరి 15 నుంచి ఈ నెల 2 వరకు భారత్‌లోని 5,911 మందికి పరీక్షలు
  • ఆందోళనకర విషయాలు వెల్లడి 
  • విదేశీ ప్రయాణాలు చేయకపోయినప్పటికీ కరోనా పాజిటివ్        
coronavirus cases in india

భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) శాస్త్రవేత్తలు ఇండియన్‌ జర్నల్‌ మెడికల్‌ రీసెర్చ్‌లో భారత్‌ కరోనా వైరస్ విజృంభణపై పలు కీలక అంశాలు తెలిపారు. దేశంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి చెందే అవకాశం ఉందని గుర్తించినట్లు చెప్పారు. దేశంలో కొన్ని వారాలు నుంచి వివిధ రాష్ట్రాల్లో కరోనా బాధితుల నుంచి ఐసీఎంఆర్‌ రాండమ్‌గా శాంపిళ్లు సేకరించి పరీక్షలు నిర్వహించింది.

వాటి ఆధారంగా పలు విషయాలను గుర్తించింది. ఫిబ్రవరి 15 నుంచి ఈ నెల 2 వరకు భారత్‌లోని 5,911 మంది తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి.
              దేశంలోని 20 రాష్ట్రాలకు సంబంధించిన 52 జిల్లాల్లో 104 మందికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. అందులో  40 మంది ఇటీవల అసలు విదేశీ ప్రయాణాలు చేయలేదు. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారితో సన్నిహితంగానూ లేరు. అయినప్పటికీ వారికి కరోనా పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా విజృంభణ అధికంగా ఉన్న పలు రాష్ట్రాల్లో సర్వే చేశారు.

గుజరాత్‌లో 792 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు చేశారు. వారిలో 13 మందికి పాజిటివ్‌ వచ్చిందని ఐసీఎంఆర్‌ తెలిపింది. అలాగే, తమిళనాడులో 577 మందికి పరీక్షలు చేయగా ఐదుగురికి, మహారాష్ట్రలో 553 మందికి పరీక్షలు చేయగా 21 మందికి, కేరళలో 502 మందికి పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ అయింది. వీటన్నిటినీ బట్టి చూస్తే, సామాజిక వ్యాప్తికి అవకాశాలు ఉన్నట్లు తేలిందని గుర్తించింది.  

More Telugu News