రేపు మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ కేబినెట్ ప్రత్యేక సమావేశం

10-04-2020 Fri 12:31
  • కీలక అంశాలపై చర్చించేందుకు అత్యవసర భేటీ 
  • కరోనా పరిస్థితి, లాక్ డౌన్ పై చర్చించే అవకాశం 
  • వడగండ్లవాన, రైతుల సమస్యలపై కూడా ఆరా
T cabinet meet tommorrow

రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా కేసులు, లాక్ డౌన్, రాష్ట్రంలో అకాల వడగండ్ల వాన, రైతుల సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ కేబినెట్ ప్రత్యేకంగా భేటీకానుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశం జరగనుంది. కరోనా కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, లాక్ డౌన్ కారణంగా పలురంగాల వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

అలాగే, అకాల వర్షాలు, వడగండ్ల వానతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైనా చర్చిస్తారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ల అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో కేంద్ర నిర్ణయం ఏదైనా ఒడిశా బాటలో నడుస్తూ రాష్ట్ర పరిధిలో లాక్ డౌన్ ను పొడిగించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం లాక్ డౌన్ పొడిగిస్తే మంచిదని గత సమావేశంలో వ్యాఖ్యానించి ఉండడంతో ఈ వార్తకు బలం చేకూరుతోంది.