40 కిలోమీటర్లు నడిచివెళ్లి ప్రియుడితో తాళికట్టించుకున్న ప్రియురాలు!

10-04-2020 Fri 09:40
  • కృష్ణా జిల్లా ఈడేపల్లిలో ఘటన
  • కాలినడకన ప్రియుడి వద్దకు బయలుదేరిన యువతి
  • పెళ్లి చేసుకుని పోలీసులను ఆశ్రయించిన జంట
Girl friend who walked 40 kilometers and tied the knot with her boyfriend

కరోనా వైరస్ మరింత ప్రబలకుండా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ఓ పెళ్లిని మాత్రం ఆపలేకపోయింది. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రియుడి వద్దకు నడిచి వెళ్లి మరీ అతడితో తాళికట్టించుకుందో ప్రియురాలు.

వివరాల్లోకి వెళితే, కృష్ణా జిల్లా ఈడేపల్లికి చెందిన కళ్లేపల్లి సాయిపున్నయ్య, హనుమాన్ జంక్షన్‌కు చెందిన సీహెచ్ భవానీ ప్రేమికులు. గత కొన్ని నెలలుగా వీరు ప్రేమించుకుంటున్నారు. తాను పలానా వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని భవానీ తన కుటుంబ సభ్యులకు తెలిపింది. ఇందుకు అంగీకరించని భవానీ తల్లిదండ్రులు పున్నయ్యకు ఫోన్ చేసి బెదిరించారు. భవానీని మర్చిపోవాలని హెచ్చరించారు.

విషయం తెలిసిన యువతి ఎలాగైనా పున్నయ్యనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఓ శుభముహూర్తాన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా కాలినడకన ఈడేపల్లికి బయలుదేరింది. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈడేపల్లికి బుధవారం చేరుకుని ప్రియుడిని కలిసింది. అనంతరం ఇద్దరూ దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులను కలిసి విషయం చెప్పి సాయం కోరారు. ఇరు కుటుంబాల పెద్దలను పిలిపించిన పోలీసులు వారికి నచ్చజెప్పి కొత్త జంటను వారి వెంట పంపడంతో కథ సుఖాంతమైంది.