COVID-19: కరోనా నుంచి నేనెలా కోలుకున్నానంటే.. వివరించిన బీజేపీ ఎంపీ కుమార్తె!

  • కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఎంపీ సిద్దేశ్వర కుమార్తె అశ్విని
  • యోగా, ప్రాణాయామమే తనను బయటపడేశాయన్న అశ్విని
  • 14 రోజుల్లో ఒక్కసారి కూడా తనలో ఆ లక్షణాలు కనిపించలేదన్న ఎంపీ కుమార్తె
BJP MP Daughter Tells What Helped Her Fight COVID19 In Hospital

కర్ణాటకలోని దావణగెరె బీజేపీ ఎంపీ జీఎం సిద్దేశ్వర కుమార్తె అశ్విని కరోనా కోరల నుంచి బయటపడ్డారు. గతనెలలో గయానా నుంచి వచ్చిన తర్వాత ఆమెలో కరోనా లక్షణాలు కనిపించాయి.  పరీక్ష చేస్తే పాజిటివ్ రావడంతో దావణగెరెలోని ఎస్ఎస్ ఆసుపత్రిలో చేరారు. 14 రోజులపాటు అక్కడ క్వారంటైన్‌లో ఉన్న ఆమె తాజాగా డిశ్చార్జ్ అయ్యారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. కోవిడ్-19 బారి నుంచి తానెలా బయటపడిందీ వివరించారు. ఆసుపత్రిలో ఉన్న 14 రోజులూ క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం చేసేదానినని వివరించారు. ఈ రెండింటితోనే తాను ఈ మహమ్మారి గండం నుంచి గట్టెక్కానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు వీటిని అభ్యాసం చేయాలని సూచించారు. ఈ మేరకు గురువారం ఓ వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. కాసేపటికే అది వైరల్ అయింది.

కరోనాకు భయపడాల్సింది ఏమీ లేదని పేర్కొన్న అశ్విని.. యోగా, ప్రాణాయామం, మానసిక స్థైర్యం.. కరోనాను ఓడించేందుకు ఈ మూడే కీలకమన్నారు. ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు తనలో ఒక్కసారి కూడా కరోనా లక్షణాలు లేవన్నారు. ఒక్కసారి కూడా తనకు తుమ్ములు కానీ, దగ్గు కానీ, జలుబు కానీ లేదని, జ్వరం కూడా రాలేదని వివరించారు.

తనను తాను శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉంచుకున్నట్టు తెలిపారు. సామాజిక దూరం పాటించాలని, ఏం చేయాలి, ఏం చేయకూడదనే దానిపై అవగాహన కలిగి ఉండాలని అశ్విని సూచించారు. కాగా, వేడినీళ్లు తాగాలని, రోజులో కనీసం 30 నిమిషాలపాటు యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చని ఆయుష్ మినిస్ట్రీ కూడా సూచించింది.

More Telugu News