లాక్ డౌన్ ఎఫెక్ట్... రూ. 35 వేల కోట్ల విలువైన వస్తుసామగ్రితో, రోడ్లపైనే నిలిచిపోయిన 3 లక్షల లారీలు!

10-04-2020 Fri 08:20
  • లాక్ డౌన్ కారణంగా నిలిచిన లారీలు
  • లారీలను రోడ్లపైనే వదిలేసి వెళ్లిన డ్రైవర్లు, క్లీనర్లు
  • గమ్యస్థానాలకు చేరినా, అన్ లోడ్ చేసేవారు లేక పడిగాపులు
Nearly 3 Lakh Trucks On roads with No Drivers

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న వేళ, డ్రైవర్లు, వర్కర్లు అందుబాటులో లేకపోవడంతో లక్షలాది లారీలు నిలిచిపోయాయి. వీటిల్లో అప్పటికే రూ. 35 వేల కోట్ల విలువైన వస్తుసామాగ్రి లోడ్ చేసి ఉన్నాయని తెలుస్తోంది. ఆ విధంగా సుమారు 3 లక్షల ట్రక్కులు నిలిచిపోయాయని తెలుస్తుండగా, వీటిల్లో కార్లు, టూ-వీలర్లు, ఫ్రిజ్ లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు, పరిశ్రమలకు అవసరమైన రా మెటీరియల్ తదితరాలు ఉన్నాయి.

గత నెలలో నరేంద్ర మోదీ, లాక్ డౌన్ ను ప్రకటించక ముందు ట్రక్స్ లోకి ఇవన్నీ అప్ లోడ్ అయ్యాయని వెల్లడించిన ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కుల్తారన్ సింగ్ అగర్వాల్, వీటిని గమ్య స్థానాలకు చేర్చాల్సిన డ్రైవర్లు, క్లీనర్లు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారని, ట్రక్కులలోకి సరకును ఎక్కించిన వారు ఇప్పుడు కనిపించడం లేదని ఆయన అన్నారు.

 "మా వాహనాలు ఎన్నో ఇప్పుడు రోడ్లపై పడిగాపులు కాస్తున్నాయి. ఇవి గమ్యస్థానాలకు చేరాలంటే, మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. ప్రస్తుతం భారత జాతీయ రహదారులపై కోట్ల విలువైన సరకుతో ఉన్న లక్షలాది లారీలు పార్కింగ్ చేయబడివున్నాయి. మరిన్ని లారీలు వేర్ హౌస్ లలో, ఫ్యాక్టరీల్లో, ట్రాన్స్ పోర్ట్ ఆఫీసుల వద్ద ఉన్నాయి" అని ఆయన అన్నారు.