Corona Virus: 5జీ టెక్నాలజీకి, కొవిడ్-19 వ్యాప్తికి సంబంధం లేదంటున్న నిపుణులు

No corona spreading with five g technology
  • 5జీ మొబైల్ టెక్నాలజీతో కరోనా వ్యాప్తి చెందుతుందని ప్రచారం
  • కొట్టిపారేసిన కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ
  • రేడియో తరంగాల ద్వారా కరోనా వ్యాప్తి చెందదని స్పష్టీకరణ
ఇంతక్రితం ప్రపంచంలో అనేక చోట్ల వైరస్ లు విజృంభించినా, అవి ఆయా ప్రాంతాలకే పరిమితం అయ్యాయి. ఇతర ప్రాంతాలకు వ్యాపించినా వాటి ప్రభావం అంతంతమాత్రమే. కానీ చైనాలో పుట్టిన కరోనా వైరస్ అనేక దేశాలకు పాకడమే కాదు, వేల సంఖ్యలో ప్రజల ప్రాణాలు బలిగొంటూ ఇప్పటివరకు భూమిపై ఉద్భవించిన వైరస్ లలో అత్యంత ప్రాణాంతకం అని గుర్తింపు తెచ్చుకుంది.

కాగా, ఈ కరోనా వైరస్ వ్యాప్తికి 5జీ మొబైల్ టెక్నాలజీయే కారణమని ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, అందులో ఎలాంటి వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు. 5జీ టెక్నాలజీ రేడియో తరంగాల ద్వారా ప్రసారం అవుతుందని, 5జీ టెక్నాలజీని కొవిడ్-19 ఏ విధంగానూ ఉపయోగించుకోలేదని వెల్లడించారు.

కరోనా వైరస్ వ్యాప్తికి మనుషులే కారణమని, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల వల్ల, కరోనా రోగితో సన్నిహితంగా మెలగడం, కరోనా వ్యక్తులు తాకిన వస్తువులను ఇతరులు తాకడం వల్ల ఈ వైరస్ సోకుతుందని కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వివరించింది. అంతేతప్ప, కరోనా వైరస్ రేడియో తరంగాలను ఆధారంగా చేసుకుని ప్రయాణించలేదని నిపుణులు స్పష్టం చేశారు.
Corona Virus
5G
Spreading
Radio Frequency
COVID-19

More Telugu News