ICMR: ఇండియాలో మారిన కరోనా పరీక్షల వ్యూహం!

  • ఇప్పటివరకూ 5 కేటగిరీల వారికే పరీక్షలు
  • ఇకపై అనుమానం ఉన్న వారందరూ చేయించుకోవచ్చు
  • హాట్ స్పాట్ కేంద్రాల్లో జలుబు, దగ్గు ఉన్నా రక్త పరీక్షలు
  • టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచనున్న ఐసీఎంఆర్
ICMR Changed Strategy On Corona Testing

ఇండియాలో కరోనా హాట్ స్పాట్ కేంద్రాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లోని ఎన్నో ప్రాంతాలను అధికారులు సీల్ చేశారు. కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న ఆయా ప్రాంతాలను అష్ట దిగ్బంధనం చేశారు. ఈ నేపథ్యంలో కరోనాపై పోరులో ముందు నిలబడిన ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) కరోనా రక్త పరీక్షల వ్యూహాన్ని మార్చింది. ఇప్పటివరకూ ఐదు కేటగిరీల్లోని ప్రజలకు మాత్రమే కరోనా పరీక్షలను చేయించుకునేందుకు అనుమతి ఇచ్చిన అధికారులు, ఇప్పుడు దాన్ని సవరించారు.

ఇకపై కరోనా పాజిటివ్ వచ్చిన రోగులతో ప్రత్యక్ష సంబంధాలు లేకున్నా, హాట్ స్పాట్ కేంద్రాల్లో ఉన్న వారు, కరోనాకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే, రక్త పరీక్షలు చేయించుకోవచ్చని ఐసీఎంఆర్ ప్రకటించింది. ప్రస్తుతం గడచిన 14 రోజుల్లో అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన వారు, కరోనా లక్షణాలన్నీ ఉన్న వారు, వారికి చికిత్సలు చేసిన వారిలో లక్షణాలు కనిపించినా, కరోనా రోగులతో హై రిస్క్ ఉన్నవారు, వివిధ కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి ఊపిరి తీసుకోవడంలో సమస్యలు వచ్చినా, కరోనా పరీక్షలు చేయించారు.

ఇప్పుడిక, వ్యూహాన్ని మార్చిన ఐసీఎంఆర్, దగ్గు, జలుబు, జ్వరం, గొంతులో మంట ఉన్నవారు ఎవరైనాఆర్టీ-పీసీఆర్ (కరోనా నిర్దారణ పరీక్ష) చేయించుకోవచ్చని, అయితే, కనీసం వారం రోజుల పాటు ఈ లక్షణాలు కనిపిస్తేనే పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.  

ఇక వివిధ రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని పట్టుబడుతున్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం, పంట చేతికి వచ్చే ఈ సమయంలో లాక్ డౌన్ కొనసాగితే, కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకున్న కేంద్రం, దశలవారీగా నిబంధనలను తొలగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో కరోనా హాట్ స్పాట్ కేంద్రాల్లో మాత్రం నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు.

వాస్తవానికి ఇండియాలో కరోనా టెస్టింగ్ కోసం డిమాండ్ కు తగ్గట్టుగా టెస్టింగ్ కిట్స్ లేవన్నది వాస్తవం. 133 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో ఇప్పటివరకూ కేవలం 1.27 లక్షల శాంపిల్స్ ను మాత్రమే ఐసీఎంఆర్ పరీక్షించింది. రాష్ట్రాల ప్రభుత్వాలు, పోలీసులు, వైద్యాధికారులు చేస్తున్న కృషితో వైరస్ ఇంతవరకూ నియంత్రణలోనే ఉంది.

సౌత్ కొరియాలో సామూహిక కరోనా పరీక్షలను నిర్వహించడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇళ్ల వద్దకే వచ్చిన మొబైల్ కియాస్క్ లు ప్రజల ముక్కు నుంచి స్రావాలను స్వీకరించి, పెద్దఎత్తున పరీక్షలు చేశాయి. ఆపై, ఆరు గంటల వ్యవధిలోనే బాధితులకు పరీక్షల ఫలితాలను మెసేజ్ చేశారు. అదే తరహా విధానాన్ని అమలు చేయాలని కూడా మన అధికారులు ఆలోచిస్తున్నారు.

More Telugu News