Pawan Kalyan: లాక్ డౌన్ పొడిగింపుపై ప్రధాని మోదీ త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది: పవన్ కల్యాణ్

  • జనసేన పీఏసీ సభ్యులతో పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్
  • ప్రధాని సూచనలను బాధ్యతాయుతంగా అందరూ పాటించాలి
  • కరోనా’ విపత్తుతో ఇబ్బంది పడుతున్న పేదలకు అండగా నిలుస్తాం
Pawan kalyan Statement about Lock down Extention

లాక్ డౌన్ పొడిగింపు, అప్పుడు అనుసరించే విధానాలపై ప్రధానమంత్రి మోదీ త్వరలో ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. జనసేన  పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులతో, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, దాని ప్రకారం పేదలకు మనం ఏవిధంగా అండగా నిలుద్దామనే దానిపై ఓ ప్రణాళికను అనుసరిద్దామని అన్నారు. ప్రధాని సూచనలను బాధ్యతాయుతంగా అందరూ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ‘కరోనా’ విపత్తులో పేద వర్గాలు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు పార్టీ పరంగా అండగా నిలుద్దామని అన్నారు.

‘కరోనా’ సంక్షోభ సమయంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నది తమ ఉద్దేశం కాదని, ఇబ్బందుల్లో ప్రజలకు అధికారుల నుంచి తగు సాయం, సేవలు అందేలా చూడాలని సూచించారు. లాక్ డౌన్ తర్వాత రాజకీయాల గురించి, పాలనలోని వైఫల్యాల గురించి మాట్లాడదామని అన్నారు.

స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ తరఫున నిలబడ్డ అభ్యర్థుల ద్వారా పేద కుటుంబాలకు వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేయించారని ఆరోపిస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యుులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి వాటిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని వారికి సూచించారు. అనంతరం, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, సభ్యుడు నాగబాబు మాట్లాడారు.

More Telugu News