ఏపీని తప్పకుండా ఆదుకుంటానని చెబుతూ జగన్ లేఖకు రతన్ టాటా బదులిచ్చారు: టీడీపీ ఎంపీ కేశినేని నాని

09-04-2020 Thu 18:33
  • ‘కరోనా’ నేపథ్యంలో రతన్ టాటాకు జగన్ లేఖ రాశారు
  • దీనిపై రతన్ టాటా స్పందిస్తూ తిరిగి లేఖ రాశారు
  • ఈ విషయాన్ని తన పోస్ట్ ద్వారా తెలిపిన కేశినేని
Ratan Tata replies to CM Jagan s letter

కరోనా వ్యాప్తి చెందకుండా ఏపీ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి  అండగా నిలవాలంటూ ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు సీఎం జగన్  విజ్ఞప్తి చేస్తూ ఇటీవలే ఓ లేఖ రాశారు. ఈ లేఖపై రతన్ టాటా స్పందిస్తూ సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో రతన్ టాటా రాసిన లేఖను జతపరిచారు.

మన జీవిత కాలంలో ఎన్నడూ చూడనటువంటి అతి పెద్ద సంక్షోభాన్ని మనందరం ఎదుర్కొంటున్నామని, అది యావత్తు ప్రపంచంపై దాడి చేసిన ‘కోవిడ్-19’ అని ఆ లేఖలో రతన్ టాటా పేర్కొన్నారు. ఈ మహమ్మారిని మనం అధిగమిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘కరోనా’ పై పోరాటానికి టాటా ట్రస్టు, టాటా గ్రూప్ తరఫున పలు రాష్ట్రాలకు తాము చేయగలిగినంత సాయం చేస్తున్నామని, అవసరమైన పరికరాలు, టెస్ట్ కిట్స్ పంపిణీ చేసే పనిలో ఉన్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల అవసరాలను తీర్చడానికి తాము తప్పకుండా ప్రయత్నిస్తామని అన్నారు. ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాలతో తమ ట్రస్ట్ సంప్రదింపులు జరుపుతుందని, తమ శక్తి కొలదీ తాము చేయగలిగినంత సాయం చేస్తామని భరోసా ఇస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు.