కరోనా మృత దేహాలకు సంబంధించి ఈ జాగ్రత్తలన్నీ పాటించండి: ఆసుపత్రులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు

09-04-2020 Thu 17:08
  • ప్రత్యేక మార్చురీ ఏర్పాటు చేయండి
  • కనీసం ఆరుగురికి పీపీఈలను సిద్ధంగా ఉంచుకోండి
  • డెడ్ బాడీలను ప్లాస్టిక్ షీట్ తో కవర్ చేయండి
TS Govt issues directions on corona dead bodies to hospitals

కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి మృత దేహాలను డిస్పోజ్ చేసే విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను విధించింది. ప్రతి ఆసుపత్రిలో కరోనా మృతుల కోసం ఒక ప్రత్యేక గదిని మార్చురీగా ఏర్పాటు చేయాలని... క్రమం తప్పకుండా ఆ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంచే రసాయనాలతో స్ప్రే చేయాలని ఆదేశించింది.

కనీసం ఆరుగురికి (డ్రైవర్, హెల్పర్, నలుగురు అటెండెంట్స్) పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ (పీపీఈ) కిట్లు సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని చెప్పింది. ఈ కిట్ లో ఎన్-95 మాస్కులు, సర్జికల్ క్యాప్స్, రక్షణ కళ్లజోళ్లు, వాటర్ రెసిస్టెంట్ ఆప్రాన్లు, సర్జికల్ గ్లోవ్స్, మోకాలి వరకు ఉండే షూలు, నిబంధనలకు అనుగుణంగా ఉండే ఫేస్ షీల్డులు ఉండాలని ఆదేశించింది.

డెడ్ బాడీలను తరలించేందుకు ఆసుపత్రులన్నీ ఫ్రీజర్ బాక్సులను రెడీగా ఉంచుకోవాలని తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ తెలిపారు. ప్రతి ఆసుపత్రి కూడా సరిపడా బాడీ బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లలో కనీసం 10 శాతానికి సరిపడా బ్యాగులను రెడీగా ఉంచుకోవాలని సూచించారు. ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా మృతదేహాలపై ఇన్ఫెక్షన్ రహిత ద్రవాన్ని స్ప్రే చేయాలని చెప్పారు. మృతదేహాలను ప్లాస్టిక్ షీట్ తో కప్పి, పైన తెల్లటి వస్త్రాన్ని చుట్టాలని తెలిపారు.

ప్రతి బ్యాగ్ కు జిప్ ఉండాలని, లీక్ ప్రూఫ్  అయి ఉండాలని అర్వింద్ కుమార్ చెప్పారు. బ్యాగ్ మందం నిబంధనల మేరకు ఉండాలని తెలిపారు. మృతదేహాన్ని హ్యాండిల్ చేస్తున్న వ్యక్తికి కూడా పీపీఈ ఇవ్వాలని చెప్పారు. కరోనా ప్రత్యేక మార్చురీలో గ్లాస్ పార్టిషన్ ఉండాలని... మృతుడి బంధువులు శవాన్ని చూసేందుకు వీలుగా ఉండాలని తెలిపారు. ఐదుగురి కంటే ఎక్కువ మందిని డెడ్ బాడీని చూసేందుకు అనుమతించవద్దని చెప్పారు. వారెవరూ డాక్టర్లకు డైరెక్ట్ కాంటాక్ట్ లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.