KTR: తన మిత్రులను అవమానపరిచారన్న ఓ నెటిజన్ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందన!

  • హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఘటన
  • నా ఇద్దరు మిత్రులు విదేశీయులను తలపించేలా ఉంటారు  
  • ఆ కారణంతో వారిని లోపలికి వెళ్లనీయలేదు
  • ఆధార్ కార్డులు చూపినా పట్టించుకోలేదన్న నెటిజన్
A Netizen complains to Minister KTR

హైదరాబాద్ లోని వనస్థలిపురంలోని స్టార్ మార్కెట్ లో నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన తన స్నేహితులు ఇద్దరిని లోపలికి రానీయకుండా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారంటూ ఓ నెటిజన్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు.

ఇలాంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని, జాత్యహంకారాన్ని ఏ రూపంలో ప్రదర్శించినా సరే కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్ అన్నారు. ఇలాంటి ఘటనలను తీవ్రంగా భావించాలని, ఈ మేరకు రిటైల్ అసోసియేషన్ కు ఆదేశాలు పంపేలా పోలీస్ కమిషనర్లను, ఎస్పీలను ఆదేశించాలని తెలంగాణ డీజీపీకి మంత్రి సూచించారు.

ఇక ఆ నెటిజన్ చేసిన వరుస ట్వీట్లలో ఉన్న విషయం ఏమిటంటే.. వనస్థలిపురంలోని స్టార్ మార్కెట్ కు వెళ్లిన తన మిత్రులిద్దరూ విదేశీయులను తలపించేలా ఉంటారని, ఆ కారణంతో వారిని లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తన మిత్రులిద్దరు తమకు సంబంధించిన ఆధార్ కార్డులను చూపించినప్పటికీ లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదని, ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి వచ్చారని తెలిపారు.

అక్కడే ఉన్న తోటి కొనుగోలు దారులు ఎవరూ కూడా వారికి మద్దతుగా రాకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని, ‘కరోనా’ మహమ్మారి మనల్ని భయపెడుతున్న సమయంలో కూడా మన సమాజంలో జాత్యహంకారానికి చోటు ఉండటం బాధాకరమని అన్నారు. రెండు మహమ్మారులు ఒకటి ‘కోవిడ్-19’, మరొటి ‘రేసిజం’తో మనం పోరాడాల్సి వస్తోందని ఆ నెటిజన్ విచారం వ్యక్తం చేశారు.

More Telugu News