WTO: మునుపెన్నడూ ఎదుర్కోనంతగా ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది: డబ్ల్యూటీవో ఆందోళన

  • 2008,1930 కంటే అధికంగా ఆర్థిక సంక్షోభం
  • ప్రపంచ వాణిజ్యం మూడోవంతు పడిపోతుంది
  • అన్ని దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి
  • ఇప్పటికే ఆర్థిక మాంధ్యంలోకి జారుకున్నామన్న ఫ్రాన్స్‌
Coronavirus WTO warns of trade slump on a scale not seen since 1930s

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) పలు కీలక విషయాలను తెలిపి ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఆ సంస్థ చీఫ్ రాబెర్టో అజెవెడో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య రంగం ఈ ఏడాది 13 నుంచి 32 శాతం మధ్య నష్టపోయే అవకాశం ఉంటుందని తెలిపారు.

2008-2009 మధ్య తలెత్తిన ఆర్థిక సంక్షోభంలోనూ ఈ క్షీణత 12.5 శాతం దాటలేదు. ఈ సారి వాణిజ్య రంగం ఇంతగా క్షీణించిపోతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2021లో దేశాల ఆర్థిక వ్యవస్థలు కాస్త నిలదొక్కుకుంటాయని, అయితే ఈ క్షీణత మాత్రం 21 శాతం నుంచి 24 శాతం మధ్య ఉంటుందని తెలిపింది.

'2008తో పాటు 1930లో తలెత్తిన పరిస్థితులతో పోల్చితే అంతకంటే ఎక్కువగానే ఈ సారి ఆర్థిక సంక్షోభం ఉంటుంది' అని రాబెర్టో అజెవెడో తెలిపారు. ప్రపంచ వాణిజ్యం మూడోవంతు పడిపోతుందని, ప్రపంచంలో ఎవరూ ఊహించని రీతిలో ఈ ప్రభావం ఉంటుందని చెప్పారు.

ప్రపంచం ఇంతకు ముందెన్నడూ చూడనంతగా ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందన్నారు. కరోనా వల్ల తతెత్తుతున్న ఆరోగ్య సంక్షోభంతో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఎన్నో విధాలుగా చర్యలు తీసుకుంటున్నాయని గుర్తు చేశారు. నిజానికి వాణిజ్యంలో క్షీణత గత ఏడాదే నమోదైందని, చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధంతో ప్రతికూల పరిస్థితులు తలెత్తాయని ఆయన తెలిపారు.

కరోనా కారణంగా విధిస్తోన్న లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఈ ఏడాది  మరింత పెరుగుతుందని చెప్పారు. ప్రపంచ దేశాల్లో వాణిజ్యానికి మార్కెట్లు తెరవడం, పెట్టుబడులు రాబట్టడం వంటి అంశాలను దేశాలు సాధిస్తే ఆర్థిక రంగం త్వరగానే కోలుకునే అవకాశం ఉందని చెప్పారు.

అన్ని దేశాల క్షీణత రెండంకెల సంఖ్యలోనే (దాదాపు 13 నుంచి 32 శాతం మధ్య ) ఉంటుందని చెప్పారు. ఎలక్ట్రానిక్స్‌, ఆటోమోటివ్‌ ఉత్పత్తుల వంటి రంగాలు కూడా క్షీణిస్తాయని అంచనా వేశారు. తాము ఇప్పటికే ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నామని ఇప్పటికే ఫ్రాన్స్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రకటించింది. తమ జీడీపీ 4.2 శాతానికి పడిపోయిందని జర్మనీ ప్రకటించింది.

More Telugu News