WHO: డబ్ల్యూహెచ్‌వోకు నిధులు ఆపేస్తామని ట్రంప్‌ చేసిన హెచ్చరికపై ఆ సంస్థ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

  • చైనాకు డబ్ల్యూహెచ్‌వో అనుకూలమని ట్రంప్‌ వ్యాఖ్యలు
  • ఖండించిన అధనామ్ ఘెబ్రేయేసస్
  • తమకు అన్ని దేశాలు ఒకటేనని వ్యాఖ్య
  • ఇటువంటి సమయంలో నిధులు ఆపేయొద్దని సూచన
WHO chief defends handling of coronavirus pandemic against Trump criticism

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేసి, హెచ్చరించిన విషయం తెలిసిందే. కరోనా గురించి డబ్ల్యూహెచ్‌వో చెప్పిన ప్రతి విషయం తప్పేనని, కరోనా పుట్టిన చైనాలో ఏం జరుగుతోందో ఆ సంస్థకు తెలుసని, అయినప్పటికీ వైరస్‌ తీవ్రతను ఎందుకు అంచనా వేయలేకపోయారని ఆయన ఇటీవల మండిపడ్డారు.

డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయలేకపోయిందని ట్రంప్ చెప్పారు. ఆ వైరస్‌ ప్రపంచవ్యాప్త మహమ్మారి అని ఈ ఏడాది మార్చి 11 వరకు ఎందుకు ప్రకటించలేదని ఆయన నిలదీశారు. అంతేగాక, డబ్ల్యూహెచ్‌వో పూర్తిగా చైనాకు అనుకూలంగా వ్యవహరించిందని, అమెరికా ఆ సంస్థకు భారీగా నిధులిస్తుందని, తన నిధులతో చైనాకు సాయం చేస్తారా? అని ప్రశ్నించిన ట్రంప్‌ నిధులని నిలిపేస్తామని ప్రకటించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ట్రంప్‌ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై డబ్ల్యూహెచ్‌వో చీఫ్, డైరెక్టర్‌ జనరల్‌ అధనామ్ ఘెబ్రేయేసస్ స్పందించారు. కొవిడ్‌-19 మహమ్మారితో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తమ సంస్థ తమ బాధ్యతలను సమర్థవంతంగానే నిర్వర్తిస్తోందని తెలిపారు. అమెరికా నిధులు ఆపేయడానికి ఇది సరైన సమయం కాదని, వైరస్ విజృంభిస్తోన్న సమయంలో నిధుల కొరత సృష్టించడం సరికాదని చెప్పారు. తాము ప్రతి దేశాన్ని సమ దృష్టితోనే చూస్తున్నామని తెలిపారు.

'మొదట ఐక్యతను సాధించాలి. రాజకీయ దురుద్దేశంతో వ్యాఖ్యలు చేయొద్దు. అమెరికా, చైనా నుంచి నిజాయతీతో కూడిన నాయకత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రపంచ వ్యాప్తంగా నిజాయతీతో కూడిన సంఘీభావంతో మెలగాలి' అని చెప్పారు. అమెరికా నిధులు ఇవ్వడాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కరోనా గురించిన సమాచారాన్ని ప్రపంచానికి డబ్ల్యూహెచ్‌వో అందిస్తూనే ఉందన్నారు.

తమ దేశంలో కరోనా వ్యాప్తి గురించి చైనా తమకు తెలిపి నేటికి 100 రోజులు పూర్తవుతాయని తెలిపారు. చైనాకు తాము అనుకూలంగా వ్యవహరిస్తున్నామని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు. ఏ పక్షపాతమూ లేకుండా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు.

More Telugu News