India: నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో!

  • దక్షిణ అమెరికాలోనే బ్రెజిల్ లో అత్యధిక కేసులు
  • హెచ్సీక్యూను పంపించాలని కోరిన బోల్సొనారో
  • అంగీకరించిన భారత్ కు కృతజ్ఞతలు
Brezil Presiden Thanks Narendra Modi

ఇప్పటికే 14 వేల మందికి పైగా కరోనా సోకి, 700 మరణాలను నమోదు చేసుకున్న బ్రెజిల్ కు కరోనాను నియంత్రించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధాన్ని ఎగుమతి చేయాలని భారత్ నిర్ణయించడంపై ప్రధాని నరేంద్ర మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో కృతజ్ఞతలు తెలిపారు. సరైన సమయానికి భారత్ విలువైన సాయం చేసిందని, దీన్ని ఎన్నటికీ మరువబోమని ఆయన వ్యాఖ్యానించారు.

"నేను భారత ప్రధానితో డైరెక్ట్ గా మాట్లాడాను. నా విజ్ఞప్తిని ఆయన మన్నించారు. శనివారం నాటికి మనకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లు అందుతాయి. ఈలోగా ముడి పదార్థాలు ఉపయోగించి, దేశంలోనే టాబ్లెట్లు తయారు చేస్తాం. ఆపై కరోనా బాధితులకు సత్వర చికిత్స అందుతుంది. మందులు పంపించాలని నిర్ణయించిన మోదీకి ధన్యవాదాలు" అని జాతిని ఉద్దేశించి బోల్సొనారో ప్రసంగించారు. భారత ప్రజలకు బ్రెజిల్ వాసులు రుణపడివుంటారని తెలిపారు.

కాగా, దక్షిణ అమెరికాలో అత్యధిక కేసులు బ్రెజిల్ లోనే నమోదయ్యాయి. గత వారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫోన్ చేసి మలేరియా ఔషధాన్ని పంపించాలని కోరిన తరువాత బోల్సొనారో కూడా నరేంద్ర మోదీతో మాట్లాడారు. రామాయణాన్ని ఉటంకిస్తూ, లక్ష్మణుడి కోసం సంజీవని తెచ్చిన హనుమంతుని మాదిరి, తమ దేశ ప్రజల రక్షణ కోసం హెచ్సీక్యూను పంపించాలని కోరారు. ఆపై ఇండియా ఎగుమతి నిబంధనలను సవరించి, అవసరమైన మిత్ర దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను ఎగుమతి చేయాలని నిర్ణయించింది.

More Telugu News