Corona Virus: కరోనాను ఓ వర్గానికో, ప్రాంతానికో ఆపాదించొద్దు: కేంద్రం

  • కరోనాకు మతం, ప్రాంతం ఉండవు
  • సామాజిక కళంకాలను రెచ్చగొట్టవద్దు
  • ప్రాంతాలు, వ్యక్తుల పేర్లు ప్రస్తావించొద్దు
  • కేంద్ర ఆరోగ్య శాఖ తాజా సూచనలు
Dont Target any Community on Corona

కరోనా వ్యాప్తి విషయంలో ఒక వర్గం, ప్రాంతంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్రం స్పందించింది. ఈ విషయంలో ఓ వర్గం వారినో, ఓ ప్రాంతం వారినో నిందించవద్దని, ఈ వైరస్ కు కుల మతాలు, ప్రాంతాల తేడా ఉండదని కేంద్రం వెల్లడించింది. కరోనా మహమ్మారి వ్యాప్తిపై తాజాగా, సలహాలు విడుదల చేసిన కేంద్రం, సామాజిక కళంకాన్ని తేవద్దని, విద్వేషాలను రెచ్చగొట్టవద్దని కోరింది.

న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ హెడ్ క్వార్టర్స్ లో మార్చి నెలలో జరిగిన తబ్లిగీ జమాత్ మత ప్రార్థనల కారణంగానే కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇంతగా పెరిగిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ సూచనలు విడుదల చేయడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఎంతో మంది సదరు వర్గం వారే కరోనాను వ్యాపింపజేశారని సోషల్ మీడియాలో నిందిస్తున్నారు కూడా.

కరోనాను ఓ వర్గానికి ఆపాదించడం ద్వారా, మత కల్లోలాలు పెరిగే ప్రమాదముందని, ప్రజల మధ్య దూరం పెరుగుతుందని, సోషల్ ఐసొలేషన్ జాతికి ప్రమాదకరమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అనవసరంగా విభేదాలు పెరుగుతాయని, ప్రజలెవరూ ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయవద్దని కోరింది. ఈ తరహా ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ, ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

సోషల్ మీడియాలో ఎవరి పేర్లను, గుర్తింపును, ప్రాంతాన్ని పేర్కొనరాదని, ఆ ప్రాంతం క్వారంటైన్ లో ఉన్నా, అక్కడ ఎందరు వ్యాధి బాధితులు ఉన్నా, ఆ వివరాలను వెల్లడించరాదని సూచించింది. ప్రజల్లో ఆందోళన పెంచే ఇటువంటి పోస్టులకు దూరంగా ఉండాలని కోరింది. ఎవరికైనా ఇన్ఫెక్షన్ సోకిందంటే, అది వారి ప్రమేయం లేకుండానే వచ్చినట్టని, అది జరుగకుండా ప్రభుత్వం తరఫున ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించింది. ఎవరి కుటుంబంలోనైనా వ్యాధి బాధితులు ఉంటే, వారికి ప్రజల నుంచి మద్దతు, సహకారం ఎంతో అవసరమని పేర్కొంది.

కరోనా సోకినప్పటికీ, వ్యాధి పూర్తిగా నయమవుతుందని, ఇప్పటికే ఎంతో మంది వైరస్ నెగటివ్ వచ్చి, ఇంటికి వెళ్లారని గుర్తు చేసింది. కరోనా సమయంలో చేయాల్సిన, చేయకూడని పనులను సూచిస్తూ, హెల్త్ అడ్వయిజరీని ఆరోగ్య శాఖ విడుదల చేసింది. హెల్త్ కేర్, శానిటరీ వర్కర్లను, పోలీసులను టార్గెట్ చేయవద్దని, వారు ప్రజల రక్షణ కోసమే ఉన్నారని గుర్తించాలని కోరింది. చట్ట వ్యతిరేక చర్యలకు దిగితే, కేసులు తప్పవని హెచ్చరించింది.

More Telugu News