Beard challenge: లాక్‌డౌన్ ఎఫెక్ట్.. సోషల్ మీడియాలో ఇప్పుడిదే ట్రెండింగ్ చాలెంజ్!

  • షేవ్ చేసుకోకుండా గడ్డాన్ని వదిలేస్తున్న యువత
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్
  • హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరూ గడ్డం లుక్‌లోనే
Beard challenge gains popularity among youth

లాక్‌డౌన్ పుణ్యమా అని యువతలో ఇప్పుడో సరికొత్త చాలెంజ్ ట్రెండ్ అవుతోంది. దాని పేరు గడ్డం చాలెంజ్ (బియర్డ్ చాలెంజ్). లాక్‌డౌన్ కారణంగా  బార్బర్ షాపులు కూడా మూతపడడంతో గడ్డాలు తొలగించుకునే మార్గం కనిపించడం లేదు. దీంతో కొందరు యువకులు దీనినో ‘చాలెంజ్’గా మార్చేసి స్నేహితులు, తెలిసినవారిని ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు. దీంతో ఇప్పుడిది విపరీతమైన పాప్యులారిటీ సంపాదించుకుంది. లాక్‌డౌన్‌లో గెడ్డాన్ని అందంగా పెంచుకోవడమే ఈ చాలెంజ్.

తాను 19 రోజులుగా వర్క్ ఫ్రం హోం చేస్తుండడంతో గడ్డాన్ని అలాగే వదిలేశానని మాదాపూర్‌కు చెందిన టెకీ పి.రాధాకృష్ణ తెలిపారు. ఇలాంటి వారు మరెందరో ఉన్నారు. తాను ఇంట్లోనే బందీగా ఉండిపోయాయని, కాబట్టి ఇప్పుడు ట్రిమ్ లుక్‌తో పనిలేదని కార్పొరేట్ ఉద్యోగి ధన్‌రాజ్ రెడ్డి తెలిపాడు. ప్రతీ రోజూ గడ్డం గీసుకునే బాధ తప్పిందని, ఇలా ఉండడం హాయిగా ఉందని పేర్కొన్నాడు.

తాను కొన్ని రోజులపాటు గడ్డాన్ని గీసుకోలేదని, ఆ తర్వాత చూస్తే అది తనకు బాగానే సూటైందని అనిపించిందని ఓ ఇంజినీరింగ్ విద్యార్థి పేర్కొన్నాడు. గడ్డంతో ఉన్న తన ఫొటోను వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తే అందరూ మెచ్చుకున్నారని, దీంతో దానిని అలాగే కంటిన్యూ చేస్తున్నానని తెలిపాడు. అంతా బాగానే ఉంది కానీ, ఇప్పటికే గడ్డం ఉన్నవారికి ఇది నిజంగా ‘చాలెంజే’. ఇప్పటికే ముఖాన్ని ఆక్రమించిన గడ్డాన్ని తొలగించుకోకుండా ఇంకా పెంచుకోవడం కొంత ఇబ్బందికరమేనని అంటున్నారు. ముఖాన్ని కప్పివేసే గడ్డంతో ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.

ఇది ఒక్క భారత్‌కే పరిమితం కాలేదు. హాలీవుడ్ స్టార్లు కూడా ఈ బియర్డ్ చాలెంజ్‌లో పాల్గొంటున్నారు. పాప్యులర్ హాలీవుడ్ స్టార్ అయిన జిమ్ కేరీ, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించారు. బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్, ఆర్.మాధవన్ వంటి వారు కూడా చాలెంజ్‌‌ను స్వీకరించి తమ ఫొటోలను షేర్ చేస్తున్నారు.

More Telugu News