ముంబయిలోని చిరా బజార్ కు సమీపంలో శ్మశాన వాటిక.. ‘కరోనా’ వ్యాపిస్తుందేమోనని స్థానికుల్లో భయం!

08-04-2020 Wed 21:59
  • ‘కరోనా’తో చనిపోయిన వారికి పెద్ద శ్మశాన వాటికలో అంత్యక్రియలు
  • దూర ప్రాంతాల్లో మృతి చెందిన వారికీ ఇక్కడే అంతిమ  సంస్కారాలు
  • శ్మశాన వాటిక పరిసరాల్లో నివాసిత ప్రాంతాలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలలు
chira bazar locals fear

‘కరోనా’ హాట్ స్పాట్ గా మారిన ముంబయిలోని చిరా బజార్ స్థానికులు భయంతో వణికిపోతున్నారు. మెరైన్ లైన్స్ రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉన్న చిరా బజార్ కు దగ్గరగా పెద్ద శ్మశానవాటిక ఉంది. ‘కరోనా’ బారిన పడి మృతి చెందిన వారి భౌతికకాయాలకు ఈ శ్మశానవాటికలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

ఈ ప్రాంతానికి చాలా దూరంలో మృతి చెందిన వారి భౌతికకాయాలను కూడా ఈ శ్మశానవాటికకే తీసుకొస్తుండటంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గడచిన రెండు రోజుల్లో కనీసం పన్నెండు మృతదేహాలకు ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించారని చెబుతున్నారు. ఈ ప్రాంతానికి చాలా దూరంగా ఉండే అంధేరి, ముంబ్రా ల నుంచి ‘కరోనా’తో మృతి చెందిన వారి భౌతికకాయాలను తీసుకొస్తున్నారని, ఈ ప్రాంతంలో ఆ వైరస్ సోకే ప్రమాదం ఉందంటూ స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ శ్మశాన వాటిక పరిసర ప్రాంతాల్లో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, హలాయ్ లోహానా నివాస్ వాసులు ఉన్నారు. ఇక్కడ 260 కుటుంబాలవారం నివసిస్తున్నామని, ఈ వైరస్ బారిన పడతామేమోనన్న భయంతో ఉన్నామని హౌసింగ్ సొసైటీ కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు. నివాస ప్రాంతాలకు సమీపంలో శ్మశాన వాటికలు ఉండకూడదని బీఎంసీ సర్క్యులర్ చెబుతోందని, ఆ నిబంధనలను అధికారులు పట్టించుకోకపోగా, ప్రజలు నివసిస్తున్న బిల్డింగ్ లు ఇక్కడ లేవని చెబుతున్నారని విమర్శించారు.

ఇదే ప్రాంతంలో ఉన్న సెయింట్ సెబాస్టియన్ గోన్ హై స్కూల్ సిబ్బంది కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్మశాన వాటికకు తమ పాఠశాలకు మధ్యలో అడ్డంగా ఓ గోడ మాత్రమే ఉందని, ‘కరోనా’ బారినపడ్డ వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు.  

ఈ విషయమై డిప్యూటీ మున్సిపల్ కమిషన్ హర్షద్ కాలే స్పందిస్తూ, ఈ మేరకు తమకు ఫిర్యాదు అందిందని, పరిశీలన నిమిత్తం అధికారులు అక్కడికి వెళ్లారని చెప్పారు. నివాసిత ప్రాంతాలకు 70 మీటర్ల దూరంలో శ్మశాన వాటిక ఉందని, ‘కరోనా’ బారిన పడి మృతి చెందిన వారిని తొమ్మిది అడుగుల లోతులో పూడ్చి పెడతారని, వైరస్ వ్యాపించకుండా తగినంత క్రిమిసంహారకాలు కూడా చల్లుతారని చెప్పారు.