mis england: ఆపద వేళ అందాల కిరీటం వదిలిన వైద్యురాలు!

  • స్టెత్ చేత పట్టిన మిస్‌ ఇంగ్లండ్ బాషా ముఖర్జీ
  • గతేడాది మిస్‌ ఇంగ్లండ్‌గా నిలిచిన భారత సంతతి అమ్మాయి
  • కరోనా నేపథ్యంలో తిరిగి విధుల్లో చేరిక
Miss England Bhasha Mukherjee Resumes Work As Doctor Amid COVID19 Crisis

ఆమె పేరు బాషా ముఖర్జీ. పుట్టింది కోల్‌కతా. నివాసం ఉంటున్నది ఇంగ్లండ్. చదివింది మెడిసిన్. ఆమె కల మాత్రం మిస్ వరల్డ్ అవడం. గతేడాది మిస్ ఇంగ్లండ్‌ కిరీటం కైవసం చేసుకొని అందాల పోటీల్లో అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు మార్గం సుగమం చేసుకుంది. మరొక్క అడుగు వెస్తే తన కల నెరవేరుతుంది. కానీ, కరోనా రూపంలో వచ్చిన ప్రళయం ఈ ప్రపంచాన్ని వణికించడం ఆమె మనసును మార్చేసింది. అంతే తన కలను పక్కనబెట్టి మళ్లీ  వైద్యురాలిగా మారి ప్రజల ప్రాణాలు రక్షించే పనిలో నిమగ్నమైంది. దాంతో, ఆమెపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

గతేడాది ఆగస్టులో మిస్ ఇంగ్లండ్‌ గా ఎంపికైన బాషా  కొంతకాలం వైద్య వృత్తికి విరామం ఇచ్చి సేవా కార్యక్రమాలతో పాటు మిస్‌ వరల్డ్‌ టైటిల్‌పై దృష్టి పెట్టాలని  నిర్ణయించుకుంది. అందుకోసం ఇప్పటికే పలు దేశాల్లో సామాజిక కార్యక్రమాలకు హాజరైంది. భారత్‌లో గత నెలలో నాలుగు వారాల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్లాన్ చేసుకుని ఇండియాకు వచ్చింది. కానీ, ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభించింది. యూకేలో పరిస్థితి దారుణంగా ఉండడంతో బోస్టన్‌లోని పిల్‌గ్రిమ్‌ ఆసుపత్రిలోని బాషా ముఖర్జీ సహచరుల నుంచి ఆమెకు సందేశాలు వచ్చాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉందో వాళ్ల ద్వారా తెలుసుకుంది.

ఈ సమయంలో వైద్యురాలిగా ప్రజలకు తన అవసరం ఉందని గ్రహించిన ముఖర్జీ వెంటనే యూకేకు తిరుగు పయనమైంది. ‘ప్రజలు చాలా ఇబ్బంది పడుతుండగా, నా సహచరులు అంతగా కష్టపడుతున్న ఈ సమయంలో నేను మిస్ ఇంగ్లండ్ కిరీటం ధరించడం సరికాదు. అందుకే వెంటనే స్వదేశానికి వచ్చి... డాక్టర్ గా నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని అనుకున్నా’ అని బాషా ముఖర్జీ చెప్పింది.  

More Telugu News