అమెరికాలో కరోనా మరణమృదంగం.. 24 గంటల్లో 1900 మంది మృతి

08-04-2020 Wed 16:17
  • అమెరికాలో 4 లక్షలకు చేరువైన కేసులు
  • 12,878 మంది మృతి
  • న్యూయార్క్‌లో మరింత ఘోరంగా పరిస్థితులు
Corona deaths continues in America

కరోనా మహమ్మారి అమెరికాలో మారణహోమం సృష్టిస్తోంది. కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే ఏకంగా 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12,878కి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 3,99,667 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 22,020 మంది కోలుకున్నారు.

అయితే, దేశంలో పరిస్థితులు నెమ్మదిస్తున్నాయని, గతంలో ఉన్నంత విషమంగా పరిస్థితులు లేవని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో లక్ష నుంచి రెండు లక్షలమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. అయితే, ఇప్పుడంత తీవ్రత లేదని తాజాగా పేర్కొన్నారు.

ఇక, న్యూయార్క్‌లో అయితే పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. అక్కడ ఇప్పటి వరకు 1.38 లక్షల మంది కరోనా బారిన పడగా, 5,400 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ పక్కనే ఉన్న న్యూజెర్సీలోనూ 1200 మంది మృతి చెందారు. అక్కడ 44,416 మంది కరోనా బారినపడ్డారు.