ట్రోఫీలు విక్రయించి.. విరాళం ప్రకటించిన యువ గోల్ఫర్ అర్జున్ భాటి!

08-04-2020 Wed 14:36
  • ఆదర్శంగా నిలుస్తున్న యువ గోల్ఫర్ అర్జున్ భాటి
  • గత ఎనిమిదేళ్లలో సాధించిన ట్రోఫీలు విక్రయం
  •  102 ట్రోఫీల విక్రయం
 Golfer Arjun Bhati donates Rs 4 lakhs to PM CARES

సాయం చేయాలన్న మనసు ఉండాలే కానీ మార్గాలు అనేకం ఉంటాయని నిరూపించాడు యువ గోల్ఫర్ అర్జున్ భాటి. గత ఎనిమిదేళ్లలో తాను గెలుచుకున్న ట్రోఫీలను విక్రయించగా వచ్చిన రూ.4.30 లక్షలను పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా అందించాడు. 15 ఏళ్ల ప్రాయంలోనే పెద్ద మనసు చాటుకున్నాడు.

ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. ప్రస్తుత సంక్షోభ సమయంలో తనకు చేతనైనంత సాయం చేయాలని భావించానని, అయితే, వ్యక్తిగతంగా తన వద్ద అంత పెద్ద మొత్తం లేకపోవడంతో ఆలోచించానని పేర్కొన్నాడు.  గత ఎనిమిదేళ్లలో తాను సాధించిన 102 ట్రోఫీలను విక్రయిస్తే రూ. 4.30 లక్షలు వచ్చిందని, ఆ మొత్తాన్ని పీఎం కేర్స్‌ ఫండ్‌కు అందించానని తెలిపాడు. ట్రోఫీలను ఎప్పుడైనా సాధించుకోవచ్చని, కానీ ఇప్పుడు కరోనాపై విజయం సాధించాలని పేర్కొన్నాడు. ట్రోఫీలను తన వాళ్లే కొన్నారని, లాక్‌డౌన్ అనంతరం వాటిని వారికి అందజేస్తానని అర్జున్ చెప్పాడు.