ప్రియురాలు వదిలి వెళ్లిపోయిందని.. హైదరాబాద్‌లో 'సాఫ్ట్‌వేర్‌' యువకుడి ఆత్మహత్య

08-04-2020 Wed 13:47
  • కేపీహెచ్‌బీ కాలనీలో ఘటన
  • అమ్మాయితో రెండేళ్లుగా సహజీవనం
  • ఆమెలేనిదే ఉండలేనని ఆత్మహత్య లేఖ
software employee suicide in hyderabad

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతి తనను విడిచి వెళ్లిపోవడంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ తానుంటోన్న గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రకిరణ్‌ (32) అనే వ్యక్తి మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఓ యువతితో అతడికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, రెండు సంవత్సరాలుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. నెల రోజుల క్రితం వరకు చంద్రకిరణ్ బేగంపేటలో నివాసమున్నాడు. అయితే, ఇటీవల కేపీహెచ్‌బీ పరిధిలోని తులసినగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో గది తీసుకుని ఉంటున్నాడు. ఇటీవలే చంద్రకిరణ్‌ను వదిలి యువతి వెళ్లిపోవడంతో అతడు మనస్తాపానికి గురయ్యాడు.
 
ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి లేనిదే తాను బ్రతకలేనని ఆత్మహత్య లేఖ రాసి గదిలోనే సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు. చంద్రకిరణ్‌కి అతడి సోదరుడు ఫోన్‌ చేయగా అతడు ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి గదికి వచ్చి చూసేసరికి ఫ్యానుకి వేలాడుతూ కనపడ్డాడు. ఈ  ఘనటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.