un: భారత్‌లో 40 కోట్ల మంది కటిక పేదరికంలోకి వెళ్తారు: ఐక్యరాజ్యసమితి నివేదిక

  • కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం
  • ప్రపంచ వ్యాప్తంగా 195 మిలియన్‌ ఉద్యోగాలు పోనున్నాయి
  • రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తలెత్తుతున్న అత్యంత సంక్షోభ ఆర్థిక పరిస్థితి 
  • తక్కువ వేతనం వచ్చే ఉద్యోగాలు కోల్పోయే అవకాశం 
Hundreds of millions of workers in India may sink deeper into poverty says UNs labour body

కరోనా వ్యాప్తి వల్ల ఏర్పడుతున్న పరిస్థితుల వల్ల భారత్‌లో కూలి పనులు, చిరు వ్యాపారాలు వంటి అనధికారిక ఆర్థిక రంగంలో పని చేస్తున్న దాదాపు 40 కోట్ల మంది (400 మిలియన్లు) కటిక పేదరికంలోకి జారుకునే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమతి కార్మిక సంస్థ హెచ్చరించింది. కరోనా వైరస్‌ ఇప్పటికే భారత్‌ సహా ప్రపంచంలోని అన్ని దేశాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది.

దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 195 మిలియన్‌ ఉద్యోగాలు పోనున్నాయని ఓ నివేదికలో తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తలెత్తుతున్న అత్యంత సంక్షోభ ఆర్థిక పరిస్థితులను కరోనా వల్ల చూడబోతున్నట్లు చెప్పింది.

'భారత్, నైజీరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక సంఖ్యలో అనధికార, అసంఘటిత రంగంలోని కార్మికులపై ఈ ప్రభావం పడుతుంది. భారత్‌లో 90 శాతం మంది ప్రజలు అనధికార ఆర్థిక రంగంలోనే పనిచేస్తున్నారు. వారంతా కటిక పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశముంది. భారత్‌లో లాక్‌డౌన్‌ కారణంగా కార్మికులపై ఈ ప్రభావం పడుతుంది. కరోనా తిరిగి వారిని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేలా చేస్తోంది' అని నివేదికలో తెలిపింది.  

'అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో కార్మికులు, వ్యాపారాలు తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. శరవేగంగా, నిర్ణయాత్మకంగా, అందరూ కలిసి చర్యలు తీసుకోవాల్సి ఉంది. సరైన, వేగవంతమైన చర్యల వల్ల లాభం ఉంటుంది. కరోనా తెస్తున్న సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 6.7 పని గంటలను ప్రపంచం కార్మికుల నుంచి కోల్పోతుంది' అని తెలిపింది.

'ఉన్నత, మధ్యస్త ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాలు ఆర్థిక పరంగా 2008-09 ఆర్థిక సంక్షోభంలో వచ్చిన నష్టం కన్నా అత్యధికంగా నష్టపోనున్నాయి' అని చెప్పింది. ప్రపంచంలో నిరుద్యోగం ఎంతగా పెరుగుతుందన్న అంశం భవిష్యత్తులో దేశాలు తీసుకునే విధానపర చర్యల మీద ఆధారపడి ఉంటుందని తెలిపింది.

ప్రపంచంలో 1.25 బిలియన్ల మంది కార్మికులు, ఉద్యోగులు హైరిస్క్‌లో ఉన్నారని, వారిని సంస్థలు తొలగించే అవకాశం లేక వేతనాల్లో కోత విధించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. తక్కువ వేతనం వచ్చే ఉద్యోగాలు, పనికి తక్కువ నైపుణ్యాలు అవసరం ఉన్న ఉద్యోగాలను ఒక్కసారిగా కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది.

More Telugu News