'పుష్ప' నుండి మరో పోస్టర్ విడుదల.. పక్కా మాస్‌లుక్‌లో బన్నీ!

08-04-2020 Wed 12:28
  • సినిమాపై ఆసక్తిని రేపుతోన్న పోస్టర్లు
  • ఎర్రచందనం స్మగ్లర్‌గా బన్నీ?
  • పోలీసులు అరెస్టు చేసినట్లు లుక్
allu arjun new look

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మూడవ సినిమా 'పుష్ప' నుంచి ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని బన్నీకి సంబంధించి మరో లుక్‌ విడుదల చేసిన ఆ సినిమా బృందం అభిమానులను ఖుషీ చేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

అందుకే ఈ లుక్‌లో బన్నీ పక్కన ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. మాసిన గడ్డం, పని చేసీ చేసీ అలసిపోయిన ముఖం.. పోలీసుల అరెస్టు చేయగా వారి ముందు నిందితుడిగా కూర్చున్న బన్నీ లుక్‌ ఈ సినిమాపై ఆసక్తిని రేపుతోంది.

బన్నీ వెనుక వ్యాను.. అందులోనూ ఎర్రచందనం దుంగలు, బన్నీ పక్కనే గొడ్డలి వున్నాయి. బన్నీయే స్మగ్లర్‌గా వాటిని కాజేసీ తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు లుక్ ద్వారా అర్థమవుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మాస్ లుక్ అలరిస్తోంది. ఈ లుక్‌ను అల్లు అర్జున్‌ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.