New Delhi: స్వీయ క్వారంటైన్‌లో ఉన్న తబ్లిగీ జమాత్‌ చీఫ్‌.. ఆచూకీని గుర్తించిన ఢిల్లీ క్రైంబ్రాంచ్‌ పోలీసులు

  • ఢిల్లీ  మర్కజ్‌లో జమాత్‌ నిర్వహణ
  • సమావేశానికి హాజరైన వారిలో వేలాది మందికి కరోనా పాజిటివ్
  • దీంతో సాద్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు
tabligi jamath chieaf moulana saad traced

ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో జమాత్‌ నిర్వహించి, దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విస్తరణకు కారకుడయ్యాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తబ్లిగీ జమాత్‌ చీఫ్‌ మహ్మద్‌ సాద్‌ ఆచూకీని ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు గుర్తించారు. జమాత్‌కు హాజరైన వారిలో వేలాది మంది కరోనా వైరస్‌ బారిన పడినట్లు ఆ తర్వాత వెల్లడి కావడం, వారి నుంచి పలువురికి వైరస్‌ విస్తరించిందన్న వైద్య వర్గాల సమాచారం నేపథ్యంలో సాద్‌పై ఢిల్లీ  పోలీసులు కేసు నమోదు చేశారు.

దీంతో అప్పటి నుంచి ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. కరోనా ప్రబలుతున్న సమయంలో నిజాముద్దీన్‌ సమావేశాన్ని రద్దు చేయాలని పలువురు ఇస్లామిక్‌ మతాధికారులు సూచించినా మౌలానాసాద్‌ వినలేదని సమాచారం. దీనివల్ల  వేలమంది జమాత్‌ సభ్యుల ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లయిందన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. పైగా జమాత్‌కు హాజరైన సభ్యులు వైద్య చికిత్సకు అంగీకరించడం లేదన్న ఆరోపణలు రావడంతో చికిత్సకు సహకరించాలని సాద్‌ వీడియో సందేశంలో కోరాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో సాద్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన కోసం ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌, షామ్లీ ప్రాంతాల్లో గాలించారు. ఎట్టకేలకు ఢిల్లీలోని జాకీర్‌నగర్‌ ప్రాంతంలో తన నివాసంలోనే మౌలానా సాద్‌ స్వీయ క్వారంటైన్‌లో ఉన్నారని ఈరోజు గుర్తించారు.

More Telugu News