Cricket: జూనియర్ల నుంచి సీనియర్లకు ఇప్పుడు గౌరవం తగ్గింది: యువరాజ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

  • కోహ్లీ, రోహిత్ తప్ప టీమిండియాలో ప్రస్తుతం రోల్‌ మోడల్స్‌ లేరు
  • అప్పట్లో మా సీనియర్లు చాలా క్రమశిక్షణతో ఉండేవారు
  • అప్పట్లో సోషల్ మీడియా కూడా లేదు
  • దీంతో వారి దృష్టి ఆ విషయంపై  కూడా మళ్లేదికాదు
Sense Of Respect Towards Seniors Has Become Thin Now Yuvraj Singh Tells Rohit Sharma

విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మను మినహాయిస్తే టీమిండియాలో ప్రస్తుతం రోల్‌ మోడల్స్‌ లేరని ఆ జట్టు మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. అలాగే, ప్రస్తుతం సీనియర్లను జూనియర్లు అంతగా గౌరవించట్లేదని చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన అభిమానులతో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపాడు. ఈ సందర్భంగా రోహిత్‌ శర్మ అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పాడు.

'నేను కానీ నువ్వు (రోహిత్) కానీ జట్టులోకి వచ్చిన సమయంలో మన సీనియర్లు చాలా క్రమశిక్షణతో ఉండేవారు. అప్పట్లో సోషల్ మీడియా కూడా లేదు. దీంతో వారి దృష్టి ఆ విషయంపైకి కూడా మళ్లేదికాదు. వారిని చూసి నేర్చుకుని క్రమశిక్షణతో మనం ఉండాల్సి వచ్చేది. వారు ప్రజలు, మీడియాతో మాట్లాడే విధానాన్ని చూసి నేర్చుకునేవాళ్లం. ఎందుకంటే వాళ్లు ఆటకు, భారత్‌కు అంబాసిడర్లలాంటి వారు' అని చెప్పాడు.

'ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. టీమిండియాలో ఆడితే ఆ తర్వాత సొంత ఇమేజ్‌పై శ్రద్ధ పెడుతున్నారు. ఇప్పటి మూడో జనరేషన్‌లో ఇద్దరే సీనియర్లు ఉన్నారు. విరాట్‌, నువ్వు (రోహిత్‌). మీరిద్దరే అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నారు. ఇతర ఆటగాళ్లు జట్టులోకి వస్తున్నారు.. వెళ్తున్నారు' అని చెప్పాడు.

'జట్టులో కొంత మంది మాత్రమే సీనియర్లకు మర్యాద ఇస్తున్నారని నేను భావిస్తున్నాను. ఎవరయినా సరే ఎవరితోనైనా సరే ఏదైనా మాట్లాడేస్తున్నారు. అప్పట్లో సోషల్ మీడియా లేదు. దీంతో అప్పట్లో కొన్ని విషయాల గురించి మనం ఆలోచించే వాళ్లం కాదు. ఒకవేళ మనం తప్పు చేస్తే ఇలా చేయొద్దని మన సీనియర్లు చెప్పేవారు. దీంతో మనలో భయం ఉండేది' అని తెలిపాడు.

ఓ కార్యక్రమంలో హార్ధిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ ఓ మహిళతో మాట్లాడిన తీరు గత ఏడాది వివాదాస్పదమైన విషయం తెలిసిందే.  దీనిపై యువీ స్పందిస్తూ.. 'ఇటువంటి ఘటనలు మా జనరేషన్‌లోనయితే జరగకపోయేవి' అని చెప్పుకొచ్చాడు.

'నేను జట్టులోకి వచ్చిన సమయంలో చాలా మంది సీనియర్లు ఉండేవారు. పీయూష్‌ చావ్లా, సురేశ్‌ రైనాతో పాటు నేను మాత్రమే జట్టులో కుర్రాడిని. ఇప్పుడు ఈ పరిస్థితులు లేవు. నేను కొత్త కుర్రాళ్లతో మాట్లాడుతున్నాను. రిషభ్‌ పంత్‌తో బాగా మాట్లాడతాను' అని తెలిపాడు.

'రిషభ్‌లో చాలా పరిశీలనా శక్తి ఉంది.. బాగా శ్రమిస్తాడు. అతడి గురించి మీడియా రాసేటప్పుడు  ఆలోచించి రాయాలి. టీమిండియాలో ఆడిన వారు అంతర్జాతీయ టోర్నీలకు ఎంపిక కాని సమయంలో దేశీయ టోర్నీల్లో ఆడాలి. ఇలా ఆడితే దేశంలోని అన్ని మైదానాల్లో ఆడిన గొప్ప అనుభవం వస్తుంది' అని చెప్పాడు.

More Telugu News