శ్రీకాకుళంలో కరోనా నిరోధక టన్నెల్‌... లోపలికి వెళ్లి వస్తే వైరస్ రహితమే!

08-04-2020 Wed 10:56
  • టన్నెల్ లో రసాయనాల పిచికారీ
  • శరీరంపై ఉండే వైరస్ హతం
  • మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటుకు చర్యలు
Corona Tunnel in Srkakulam is Very Useful

ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకూ కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా రాని జిల్లాలో ముందు నిలిచిన శ్రీకాకుళంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఓ వినూత్న ఏర్పాటు చేశారు. ఇక్కడ జనసమూహం అధికంగా తిరిగే మార్కెట్ ప్రాంతంలో 'కరోనా నిరోధక టన్నెల్‌'ను ఏర్పాటు చేశారు. పట్టణంలోని 80 అడుగుల రోడ్డులో తాత్కాలిక మార్కెట్‌ వద్ద నగరపాలక సంస్థ దీన్ని ఏర్పాటు చేయగా, కలెక్టర్‌ జే నివాస్‌ ప్రారంభించారు.

ఇక దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇందులోకి ఓసారి ప్రవేశించి, బయటకు వస్తే, ఇన్ఫెక్షన్ రహితం కావచ్చు. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఈ టన్నెల్‌లో, కరోనా తదితర ఇన్ఫెక్షన్లను వెదజల్లే క్రిములను నాశనం చేసేలా రసాయనాలను అనుక్షణం చల్లుతుంటారు. దీనిలో నిరంతరాయంగా సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే అవుతూ ఉంటుంది. టన్నెల్ లో నడిచి వెళితే, ఈ ద్రావణం పిచికారీ అయి దుస్తులు, శరీరంపైనా ఉండే క్రిములు, వైరస్‌లు నశించిపోతాయి.

సుమారు రూ. లక్ష రూపాయల వ్యయంతో దీన్ని తయారు చేశామని, త్వరలోనే ఇచ్ఛాపురం, పలాస, కాశీబుగ్గ, ఆమదాలవలస మునిసిపాలిటీలతో పాటు, పాలకొండ, రాజాం నగర పంచాయతీల్లోనూ ఇవే తరహా టన్నెల్స్ ను ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు.