కరోనా పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో చేరి కూడా... బయటకు వచ్చేస్తున్న హిందూపురం వాసులు!

08-04-2020 Wed 10:47
  • అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో నిర్వాకం
  • ఐసొలేషన్ వార్డుల నుంచి వచ్చి బయట తిరుగుతన్న వైనం
  • పోలీసు బందోబస్తు పెంచాలని వైద్యుల వినతి
Corona Patients Walking Outside at Ananthapur Hospital

కరోనా పాజిటివ్ వచ్చి, ఆసుపత్రిలో చేరిన కొందరు హిందూపురం వాసులు చేస్తున్న ఓవరాక్షన్ ను చూసి, ఆసుపత్రి వర్గాలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నాయి. అనంతపురంలో ఉన్న సర్వజనాసుపత్రిలో హిందూపురం ప్రాంతంలో కరోనా సోకిన కొందరిని ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు.

వీరెవరూ ఇతరులను కలవరాదని, బయటకు కూడా రాకూడదని ఆసుపత్రి వర్గాలు స్పష్టంగా చెబుతున్నా, వీరెవరూ వినే పరిస్థితిలో లేరు. వీరంతా గదుల నుంచి బయటకు వచ్చి, వారిష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఆసుపత్రి వర్గాలు చెప్పినా వినడం లేదు. దీంతో వారు తమ తమ గదుల నుంచి బయటకు రాకుండా పోలీసులను కాపలా పెట్టాలని, భద్రతను పెంచాలని, లేకుంటే ప్రమాదకర పరిస్థితులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.