లాక్ డౌన్ సమయంలో కూడా ధనవంతుడైన ఏకైక భారతీయ బిలియనీర్!

08-04-2020 Wed 10:47
  • సంక్షోభంలో కూడా దూసుకుపోయిన రాధాకిషన్ దమానీ
  • కస్టమర్లతో కిటకిటలాడుతున్న డిమార్ట్ స్టోర్లు
  • 10.2 బిలియన్ డాలర్లకు పెరిగిన దమానీ సంపద
The Only Indian Billionaire To Get Richer Under Coronavirus Lockdown

లాక్ డౌన్ తో భారతీయ సంపన్నుల సంపద భారీగా హరించుకుపోయింది. అయితే ఒక వ్యాపారవేత్త సంపద మాత్రం ఈ సంక్షోభ సమయంలో కూడా అమాంతం పెరిగింది. ఆయనే అవెన్యూ సూపర్ మార్ట్స్ (డిమార్ట్ స్టోర్స్) అధినేత రాధాకిషన్ ధమానీ.

ఈ ఏడాది ఆయన సంపద 5 శాతం పెరిగి 10.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మన దేశ 12 మంది అత్యంత శ్రీమంతుల్లో ఈయన సంపద మాత్రమే పెరగడం గమనార్హం. ఈ ఏడాది అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్ వాల్యూ 18 శాతం పెరిగిందని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది.

ముంబైలోని ఓ సింగిల్ రూమ్ అపార్ట్ మెంట్ నుంచి తన ప్రస్థానాన్ని దమానీ ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ తన వ్యాపారాన్ని దేశమంతా విస్తరించారు. కరోనా నేపథ్యంలో తన పోటీదారులైన ముఖేశ్ అంబానీ, ఉదయ్ కొటక్ లు ఇబ్బందులు పడ్డా... దమానీ మాత్రం లాభాల్లో దూసుకుపోయారు. కరోనా భయాల నేపథ్యంలో... ప్రజలంతా నిత్యావసర సరుకుల కోసం మార్టులకు క్యూ కట్టడంతో... సంక్షోభ సమయంలో కూడా ఈయన వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగింది. దీంతో సంస్థ షేర్ల విలువ కూడా భారీగా పెరిగింది.

వినియోగదారులకు ఇతర స్టోర్ల కంటే తక్కువ ధరలకు సరుకులను అందించడమే డిమార్ట్ వ్యాపార రహస్యం. మధ్య తరగతి ప్రజల ఆలోచనలకు తగ్గట్టుగా ధరలు ఉండటంతో... డిమార్ట్ స్టోర్లు అనునిత్యం కస్టమర్లతో కళకళలాడుతుంటాయి. కరోనా భయాల నేపథ్యంలో, నిత్యావసరాల కొరత ఉంటుందేమోనన్న సందేహాలతో జనాలు డిమార్ట్ స్టోర్లకు వెల్లువెత్తారు. దీంతో, డిమార్ట్ స్టోర్లు భారీ ఎత్తున బిజినెస్ చేశాయి. దేశ వ్యాప్తంగా 1300 డిమార్ట్ స్టోర్లు ఉన్నాయి. మన దేశంలో రెండో అతిపెద్ద రీటెయిల్ చైన్ డిమార్ట్ కావడం గమనార్హం.