'కోవిడ్-19' మానవ సృష్టా? లేక సహజసిద్ధమా?... నిపుణులు చెబుతున్నది ఇదే!

08-04-2020 Wed 10:20
  • కరోనాను వూహాన్ లో తయారు చేశారని ఊహాగానాలు
  • అదంతా అవాస్తవమేనంటున్న స్క్రిప్స్ రీసెర్చ్ పరిశోధన
  • సహజసిద్ధంగా పుట్టిన వైరస్ అంటున్న ప్రొఫెసర్ క్రిస్టియన్ అండర్సన్
  •  'నేచర్ మెడిసిన్' జర్నల్ లో అధ్యయనం వివరాలు
Is Corona Man Made or Natural

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్- 19 మహమ్మారి వైరస్ ను వూహాన్ లోని ఓ ల్యాబ్ లో చైనాయే స్వయంగా అభివృద్ధి చేసిందని, ఆ వైరస్ ను ఓ జీవాయుధంగా అభివృద్ధి చేస్తుంటే, అది లీక్ అయి, బయటకు వచ్చిందని, ఆ మధ్య ఓ వార్త చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ పై ప్రపంచం వ్యాప్తంగా పలు దేశాల్లో పరిశోధనలు జరిగాయి. ఈ వైరస్ మానవ సృష్టి కాదని, ప్రకృతిలో సహజంగానే అభివృద్ధి చెందిందని ఈ పరిశోధనలు తేల్చాయి.

తాజాగా, స్క్రిప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చేసిన కొత్త పరిశోధనలు సార్స్-సీఓవీ2 కరోనావైరస్ సహజ మూలాన్ని కలిగి ఉన్నాయని ధ్రువీకరిస్తున్నాయి. పలువురు ఊహించినట్టుగా ప్రయోగశాలలో సృష్టించబడలేదని స్పష్టమైంది. చైనా విడుదల చేసిన సార్స్సీ-సీఓవీ2 నుండి విశ్లేషించబడిన పబ్లిక్ జీనోమ్ సీక్వెన్స్ డేటాను విశ్లేషించి, అది సహజసిద్ధంగా రూపాంతరం చెందిన వైరస్సేనని తేల్చింది.

డిసెంబరులో హుబీ ప్రావిన్స్‌లో ఈ వైరస్ మొట్టమొదటిసారిగా వెలుగులోకి రాగా, అప్పటి నుంచి ఇది 200కు పైగా దేశాలకు విస్తరించి, సుమారు 14 లక్షల మందికి సోకింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం ఈ వైరస్ ను ఓ మహమ్మారిగా వర్గీకరించింది. ప్రపంచ దేశాలు మరియు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు మహమ్మారిని ఎదుర్కొని ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ వైరస్ ను ల్యాబొరేటరీల్లో తయారు చేసి, జీవ ఉగ్రవాదం రూపంలో విడుదల చేశారని, లేదంటే ప్రమాదవశాత్తూ బయటకు వచ్చిందన్న ఊహాగానాలు వాస్తవ విరుద్ధమేనని 'నేచర్ మెడిసిన్' జర్నల్ తాజా సంచికలో "సార్స్ - సీవోవీ2 యొక్క సమీప మూలాలు" పేరిట ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ఈ వైరస్ సహజ పరిణామానికి బలమైన సాక్ష్యాలను హైలైట్ చేసింది.

"కరోనా వైరస్ జాతుల కోసం అందుబాటులో ఉన్న జన్యు శ్రేణి డేటాను పోల్చడం ద్వారా, వైరస్ సహజ ప్రక్రియల ద్వారా ఉద్భవించిందని మేము గట్టిగా నిర్ణయించగలము" అని అధ్యయనం సహ రచయిత, స్క్రిప్స్ రీసెర్చ్‌లో ఇమ్యునాలజీ మరియు మైక్రోబయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ క్రిస్టియన్ అండర్సన్ వ్యాఖ్యానించారు.

వూహాన్ లో కరోనా వైరస్ వ్యాపించిన తొలినాళ్లలోనే, దీని జన్యు  క్రమాన్ని చైనా విడుదల చేసి, ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులకు అందించింది. ఆపై అండర్సన్ మరియు అతని సహచరులు దీని మూలాన్ని తెలుసుకోవడానికి ఈ డేటాను ఉపయోగించగా, వైరస్ లోని సహజ పరిణామాన్ని సూచించే అనేక ముఖ్యమైన లక్షణాలు కనిపించాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే మానవ కణాల బయటి ఉపరితలంపై ఏర్పడే ఎంజైమ్ (ఏసీఈ2)ను లక్ష్యంగా చేసుకునేందుకు, మూల కణాలను కట్టిపడేసే రిసెప్టర్-బైండింగ్ డొమైన్ (ఆర్బీడీ) అనే కొనలు కలిగిన ప్రోటీన్ ఉద్భవించిందని తమ పరిశోధనల్లో తేలిందని ఆయన తెలిపారు.

కోవిడ్-19 స్పైక్ ప్రోటీన్ మానవ కణాలతో బంధించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని, ఇది కృత్రిమంగా కాకుండా, సహజసిద్ధంగా మానవ వ్యతిరేక ఫలితాలను చూపిస్తుందని బృందం తేల్చింది. వైరస్ పరమాణు నిర్మాణం, ఇతర వైరస్ లకు భిన్నంగా ఉందని, మానవులలో తీవ్రమైన అనారోగ్యానికి కారణమయ్యే ఇతర వైరస్ లతో పోలిస్తే, వాటిని అనుకరించకుండా గబ్బిలాలు, అలుగు లలో కనిపించే వైరస్ జాతులను పోలి ఉంటుందని క్రిస్టియన్ ఆండర్సన్ వెల్లడించారు.

ఇప్పటివరకూ వైరస్ మూలాల గురించి మానవాళికి కచ్ఛితమైన సమాచారం తెలియనప్పటికీ, ఇది గబ్బిలాల నుంచి మానవులకు సంక్రమించిందని తెలుస్తోంది. ఇదే సమయంలో మరో సిద్ధాంతం ప్రకారం అలుగులు  వైరస్ వ్యాప్తికి థర్డ్ పార్టీగా వ్యవహరించాయని సమాచారం. కరోనా వైరస్ నాన్-పాథోజెనిక్ వెర్షన్ ఒక జంతువు నుండి మానవునికి సోకి, ఆపై మహమ్మారిగా రూపాంతరం చెంది, ప్రస్తుత స్థితికి కారణమైందని పరిశోధకులు భావిస్తున్నారు.