WHO: చైనా పక్షపాతిగా మారిన డబ్ల్యూహెచ్ఓపై నా పవర్ చూపిస్తా: ట్రంప్ హెచ్చరిక

  • వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు నిధుల నిలిపివేత
  • కరోనా వైరస్ ను తక్కువ చేసి చూపారు
  • చైనాకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారని ట్రంప్ మండిపాటు
Trump Warns to Stop Funding for WHO

కరోనా ప్రపంచాన్ని పీడిస్తున్న వేళ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) చైనా పక్షపాతిగా వ్యవహరిస్తోందని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తాజాగా వాషింగ్టన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, డబ్ల్యూహెచ్ఓకు నిధులను నిలిపివేస్తామని వ్యాఖ్యానించారు. ఐరాసలో భాగంగా ఉన్న డబ్ల్యూహెచ్ఓకు అమెరికా నుంచి అత్యధికంగా నిధులు అందుతూ ఉంటాయన్న సంగతి విదితమే.

"వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోసం వెచ్చిస్తున్న నిధులను నిలిపివేస్తాం. నేను కేవలం మాటలు మాత్రమే చెప్పడం లేదు. చేసి చూపిస్తా. నిధుల విడుదలను నిలిపివేయబోతున్నాం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ఎంత మేర నిధులను నిలుపుదల చేస్తారు? మొత్తం నిధులను హోల్డ్ చేస్తారా? అన్న విషయమై ట్రంప్ స్పష్టతను ఇవ్వలేదు.

డబ్ల్యూహెచ్ఓ వైఖరి బాగాలేదని అభిప్రాయపడ్డ ఆయన, అన్ని దేశాలనూ సమానంగా చూడాల్సిన డబ్ల్యూహెచ్ఓ, చైనాకు మాత్రమే అనుకూలంగా ఉందని మండిపడ్డారు. చైనాలో తొలుత వైరస్ వెలుగులోకి వచ్చిన తరువాత, డబ్ల్యూహెచ్ఓ నుంచి వచ్చిన అసత్యపు సిఫార్సుల కారణంగానే, అంతర్జాతీయ ప్రయాణాలు సాగాయని, ముందుగానే హెచ్చరించి వుంటే, ఇంత ఘోర పరిస్థితి ప్రపంచానికి ఎదురయ్యేది కాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. చైనా నుంచి వచ్చే విమానాలను అనుమతించాలని తన ముందుకు ప్రతిపాదనలు వచ్చాయని, అయితే, తాను అదృష్టవశాత్తూ దాన్ని అంగీకరించలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.

కరోనాను నివారించడంలో విఫలమయ్యారంటూ, దేశ ప్రజల నుంచి, రాజకీయ ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ట్రంప్, వైరస్ బాధితులు, మరణాల సంఖ్యపై చైనా తప్పుడు లెక్కలను ప్రపంచం ముందు ఉంచిందని విమర్శలు గుప్పించారు. వైరస్ ప్రభావాన్ని చైనా తక్కువగా చూపిందని దుయ్యబట్టారు. 

  • Loading...

More Telugu News