జాతి భవిష్యత్తుకు ఈ వారం అత్యంత కీలకం!

08-04-2020 Wed 08:19
  • 21 రోజుల లాక్ డౌన్ లో ముగిసిన రెండు వారాలు
  • మరో వారం పకడ్బందీగా అమలుకు చర్యలు
  • ఆపై కేసుల సంఖ్య తగ్గే అవకాశం
  • ఇండియాలో థర్డ్ స్టేజ్ రాలేదంటున్న అధికారులు
Next One Week Crucial for India

కరోనా మహమ్మారి కట్టడికి, కేంద్రం ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ లో రెండు వారాలు గడిచిపోయాయి. మరొక్క వారమే మిగిలుంది. ఈ వారం రోజులూ అత్యంత కీలకమని, జాతి భవిష్యత్తు ఈ వారం రోజుల్లోనే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకూ జరిగిన లాక్ డౌన్ ఒక ఎత్తయితే, ఈ వారం రోజులూ మరింత పకడ్బందీగా నిబంధనలు పాటిస్తే, కరోనాను తరిమి కొట్టడంలో దాదాపు విజయం సాధించినట్టేనని చెబుతున్నారు.

వాస్తవానికి వైరస్ సోకిన వ్యక్తుల్లో ఆ లక్షణాలు బయట పడాలంటే, 2 నుంచి 14 రోజుల సమయం అవసరం. పరిస్థితులన్నీ సాధారణంగా ఉంటే, 14 రోజుల సమయం పూర్తయింది కాబట్టి, వైరస్ లక్షణాలున్న వారంతా బయటపడినట్టే. అయితే, అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చిన మర్కజ్ మత ప్రార్థనలు, దేశంలో వైరస్ బాధితుల సంఖ్యను మరింతగా పెంచేశాయి. ఈ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారి ట్రేసింగ్ ఇంకా పూర్తి కాలేదు. తమలోని అపోహలు, భయాల కారణంగా, ఇంకా ఎంతో మంది, తమంతట తాముగా ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్టుగా అంగీకరించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో పోలీసులు, స్థానిక అధికారులు వీరిని వెతికి పట్టుకునే పనిలోనే నిమగ్నమై ఉన్నారు. ఇది ఓ రకంగా ఆందోళన కలిగిస్తోంది.

ఇక లాక్ డౌన్ కు ముందు వైరస్ సోకిన వారిలో లక్షణాలు ఈ నెల 5 నుంచి 10వ తేదీలోపు బయటపడతాయి. 10 తరువాత వైరస్ పాజిటివ్ కేసులు ఏ మేరకు తగ్గుతాయన్న విషయమే ఇప్పుడు కీలకం. ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో వివిధ దేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారు, మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిదే అగ్రస్థానం. దీంతో వైరస్ వ్యాప్తి మూడవ దశకు చేరుకోలేదని, కాబట్టి, దీని నివారణ ఇంకా మన చేతుల్లోనే ఉన్నట్టు భావించవచ్చని వైద్య రంగంలోని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక, మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిలో అత్యధికులు మార్చి 17 నుంచి 20 మధ్య తమతమ ప్రాంతాలకు చేరగా, వారిని, వారితో కలిసున్న వారిని గుర్తించి, 2వ తేదీ నాటికి అందరినీ క్వారంటైన్ చేశారు. వీరు స్వస్థలాలకు వచ్చి, గత సోమవారం నాటికి 14 రోజులు దాటింది. అంటే, గుర్తించిన మర్కజ్ యాత్రికుల్లో ఎవరికైనా కరోనా సోకివుంటే, ఈ పాటికి బయటపడ్డట్టే. ఇక వీరిద్వారా వైరస్ మరెవరికైనా సోకివుంటే, వారిలో లక్షణాలు కనిపించడానికి మరో 10 రోజుల సమయం... అంటే, ఈ నెల 15 వరకూ సమయం పట్టవచ్చు.

ఇక వైరస్ వచ్చిందని తెలియకముందే దాన్ని మరికొందరికి అంటించే అవకాశాలు ఉండటంతో, ఈ నెల 14 వరకూ ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి, లాక్ డౌన్ ను పాటిస్తే, వైరస్ అదుపులోకి వస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఇక ఈ వారం రోజులూ అనుసరించాల్సిన కంటైన్‌ మెంట్‌ విధానంపై ఓరియంటేషన్‌ సెషన్‌ ను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కలెక్టర్లు, పోలీస్‌ అధికారులతో ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది. ప్రజలకు ఆహార, నిత్యావసర వస్తువులు, మందులకు ఇబ్బందులు లేకుండానే లాక్ డౌన్ ను అమలు చేయాలని కేంద్రం సూచిస్తోంది. అందరూ సమష్టిగా మరో వారం పాటు కృషి చేస్తే, కరోనాపై పోరులో మంచి ఫలితాలను చూడవచ్చని సూచిస్తోంది.