నేడు అఖిల్ పుట్టిన రోజు... సినిమాలోని ఏ పోస్టర్, టీజర్ రిలీజ్ చేయడం లేదట!

08-04-2020 Wed 07:53
  • దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి
  • నాకోసం మీ ఫ్యామిలీతో ఫొటోదిగి పోస్ట్ చేయండి
  • వీడియో పోస్ట్ చేసిన అఖిల్
No New Movie Update on Akhil Birthday

ఏ హీరో పుట్టిన రోజు వచ్చినా, అతని కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్, టీజర్ లేదా మరే ఇతర మూవీ అప్ డేట్ అయినా వస్తుందన్న ఆనందంలో ఫ్యాన్స్ ఉంటారనడంలో సందేహం లేదు. కానీ, అక్కినేని ఫ్యాన్స్ కు మాత్రం నేడు నిరాశే. నేడు నాగార్జున నట వారసుడు అఖిల్ పుట్టిన రోజు కాగా, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో టీజర్, పోస్టర్ విడుదల సరికాదని భావించిన అఖిల్, పుట్టిన రోజును జరుపుకునే పరిస్థితిలో అందరమూ లేమని, ఎవరూ వేడుకలు చేయవద్దని విజ్ఞప్తి చేశాడు.

ఈ మేరకు అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన ఓ వీడియోను ఆయన నిన్న విడుదల చేశాడు. "హాయ్ ఎవ్రీవన్... అందరూ బాగున్నారా? చాలా రోజులైంది కనెక్ట్ అయ్యి. నేను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే రేపు నా పుట్టినరోజు. పుట్టినరోజు అనగానే కేక్ కటింగ్స్ గానీ, సెలబ్రేషన్స్ గానీ, ఫ్యాన్స్ అందరూ చేస్తుంటారు.

అయితే, ఈ సమయంలో అవి కరెక్ట్ కాదు. ప్లీజ్... దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి. సేఫ్ గా ఉండండి. రేపు (ఏప్రిల్ 8) నా సినిమా నుంచి ఏ పోస్టర్ కానీ, టీజర్ కానీ రిలీజ్ చేయడం లేదు. ఇది నా పర్సనల్ డెసిషన్. ఏమీ రిలీజ్ చేయడం లేదు. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అడిగినా, నేనే వద్దన్నాను. అది మీకు చెబుదామనే ఇలా పోస్ట్ చేస్తున్నాను.

మీ ధైర్యంతోనే, మీ బలంతోనే మేము సినిమాలు చేస్తుంటాం. కానీ ఆ బలం, ఆ ధైర్యం ఇప్పుడు మీ కుటుంబాలకు అవసరం. వాళ్లతోనే ఉండండి. మీరు స్ట్రాంగ్ గా ఉండండి. రేపు నా పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు సంబంధం లేని...  మా ఫ్యామిలీతో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేస్తాను. మీరు కూడా మీ ఫ్యామిలీతో హ్యాపీ ఫొటో తీసుకోండి. నాకోసం పోస్ట్ చేయండి. ఇండియా కోసం.. ప్రపంచం కోసం, ఈ కరోనా-కోవిడ్ 19పై అందరం కలిసి ఫైట్ చేద్దాం. అందరికీ ధన్యవాదాలు" అని అన్నాడు.