నా జీతాన్ని తగ్గించండి: రాష్ట్రపతికి ఏపీ గవర్నర్ లేఖ

08-04-2020 Wed 07:35
  • నెల వేతనంలో 30 శాతం కోత విధించండి
  • కరోనా కట్టడి చర్యలకు వినియోగించండి
  • రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు అంగీకార లేఖ
AP Governer Letter to President for Salary Cut

కరోనా వైరస్ నివారణ చర్యలకు సహకరించే క్రమంలో భాగంగా తన వేతనాన్ని తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్రపతికి లేఖను రాశారు. ప్రధాని పిలుపును అందుకున్న మరుక్షణమే తన వేతనంలో సంవత్సరం పాటు ముప్పై శాతం కోతకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చానని పేర్కొంటూ, రాష్ట్రపతికి అంగీకార లేఖను పంపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలను చేపడుతున్నదని వ్యాఖ్యానించిన ఆయన, ఈ క్రమంలో అర్ధికపరమైన వెసులుబాటు తప్పనిసరని సూచించారు.

కాగా, ఇప్పటికే పార్లమెంటు సభ్యుల నిధులను (ఎంపీ లాడ్స్) రద్దు చేసిన కేంద్రం, వారి జీతాల్లోనూ కోత విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, పలు రాష్ట్రాల గవర్నర్లు స్వచ్ఛందంగా జీతాల కోతకు ముందుకు వస్తున్నారని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ప్రతి నెలా తన వేతనం నుంచి 30 శాతం మొత్తాన్ని మినహాయించి, ఆ డబ్బును కరోనా కట్టడికి వెచ్చించాలని బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు లేఖ రాశారు. గవర్నర్ అదేశాల మేరకు రాజ్ భవన్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తూ సామాజిక బాధ్యతలో భాగంగా గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని, తదనుగుణ ఏర్పాట్లు చేయాలని కోరారు.