క్లయింట్ కు ‘స్టే’ ఇవ్వలేదన్న కోపంతో... జడ్జికి ‘కరోనా’ సోకాలంటూ దూషించిన లాయర్!

07-04-2020 Tue 22:27
  • కలకత్తా హైకోర్టులో ఘటన
  • బస్సు వేలం నిలిపివేయాలంటూ ‘స్టే’ కోరిన న్యాయవాది
  • అది కుదరదన్న జడ్జిపై మండిపడుతూ దూషణ
An Advocate curses a Judge

కలకత్తా హైకోర్టులో ఓ ఆశ్చర్యకర, అభ్యంతరకరమైన సంఘటన చోటుచేసుకుంది. తన క్లయింట్ కు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదన్న కోపంతో ఏకంగా జడ్జిపైనే మండిపడుతూ ఆయనకు కరోనా వైరస్ సోకాలంటూ దూషించాడు ఓ లాయర్.

ఈ సంఘటన గురించిన వివరాలు.. ‘కరోనా’ నేపథ్యంలో మార్చి 15 నుంచి చాలా అత్యవసరమైన కేసులను మాత్రమే కలకత్తా హైకోర్టులో విచారణ చేపడుతున్నారు. ఈ తరహా కేసులను మార్చి 25 నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేస్తోంది. ఈ నేపథ్యంలో లాయర్ బిజోస్ అధికారి తన క్లయింట్ కేసుకు సంబంధించిన ‘స్టే’ నిమిత్తం కలకత్తా హైకోర్టుకు వెళ్లారు.

 ఓ జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం ద్వారా సదరు క్లయింట్ ఆ బస్సును కొనుగోలు చేశాడు. అయితే, రుణ బకాయిలను సవ్యంగా చెల్లించకపోవడంతో ఆ బస్సును ఈ ఏడాది  జనవరి 15న సీజ్ చేసిన బ్యాంకు అధికారులు, దానిని వేలం వేసేందుకు ప్రకటన ఇచ్చారు.

ఈ వేలం పాటను ఆపాలని కోరుతూ ‘స్టే’ కోసం బిజోస్ వాదించాడు. అయితే, న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా ఇందుకు నిరాకరిస్తూ ఉత్తర్వులు డిక్టేట్ చేస్తున్న సమయంలో, కోపోద్రిక్తుడైన సదరు లాయర్, అదే పనిగా ఆయనకు అడ్డుతగులుతూ, టేబుల్ పై చరుస్తూ విపరీతంగా ప్రవర్తించారు.

దీంతో, గౌరవప్రదమైన న్యాయవాద వృత్తిలో ఉండి ఈ విధంగా ప్రవర్తించడం తగదని, భవిష్యత్ లో దెబ్బతింటావంటూ బిజోస్ అధికారిని జడ్జి మందలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో, మరోమారు సహనం కోల్పోయిన బిజోస్ అధికారి, జడ్జికి కరోనా వైరస్ సోకాలంటూ దూషించాడు. కోర్టు నిబంధనలను ఉల్లంఘించిన బిజోస్ అధికారికి నోటీస్ జారీ చేశారు. క్రిమినల్ చట్టం కింద విచారణ జరిపించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.