Corona Virus: ఒక్కడి ద్వారా 406 మందికి వైరస్... కరోనాపై ఐసీఎంఆర్ అధ్యయనం

  • లాక్ డౌన్ నిబంధనలు పాటించని వ్యక్తితోనే ముప్పు
  • నిబంధనలు పాటిస్తే వ్యాధి సోకే రేటు తగ్గుతుందన్న ఐసీఎంఆర్
  •  లాక్ డౌన్ విధించడానికి కారణం ఇదేనన్న లవ్ అగర్వాల్
ICMR study tells one person can spread corona to huge in thirty days without lock down

కరోనా వ్యాప్తి కట్టడి చేయడం ప్రభుత్వాలకు సవాల్ గా మారింది. ఓ వ్యక్తికి కరోనా సోకినప్పుడు ఆ వైరస్ తాలూకు లక్షణాలు బయటపడేసరికి 14 రోజుల సమయం పడుతుంది. ఈ లోపే ఆ వ్యక్తి మరికొందరికి వైరస్ అంటించే అవకాశాలు ఉండడంతో కరోనా వేగంగా విస్తరిస్తోంది. దీనిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ఓ అధ్యయనం చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈ అధ్యయనం గురించి మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఓ కరోనా పాజిటివ్ వ్యక్తి లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా సమాజంలో తిరిగినట్టయితే 30 రోజుల్లో 406 మందికి వ్యాధి సంక్రమింపచేయగలడని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. దీన్ని వైద్య పరిభాషలో 'ఆర్ నాట్' (R0) గా భావిస్తారు. అయితే, సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోగలిగితే ఆ వ్యక్తి ఇతరులకు వైరస్ అంటించే శాతాన్ని గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు. నివారణ చర్యలు తీసుకుంటే అతడి ద్వారా వైరస్ బారినపడేవాళ్ల సంఖ్య సగటున కేవలం 2 నుంచి 2.5 వరకు ఉంటుందని తెలిపారు.

కరోనా రోగి సామాజిక సంచారాన్ని 75 శాతానికి పరిమితం చేయగలిగితే వ్యాధి సంక్రమణం కూడా అదే స్థాయిలో తగ్గిపోతుందని ఐసీఎంఆర్ అధ్యయనం చెబుతోంది. కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ విధించింది ఈ కారణంగానే అని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.

More Telugu News