‘కరోనా’ లెక్కలను దాచాల్సిన అవసరం లేదు: మంత్రి పేర్ని నాని

07-04-2020 Tue 19:31
  • వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సమాచార సేకరణ జరుగుతోంది
  • రాష్ట్ర వ్యాప్తంగా 6175 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారు
  • వాళ్లందరిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంది
Minister Perni Nani Press meet

ఏపీలో  కరోనా వైరస్ బారిన పడ్డ వారి లెక్కలను దాచాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. విజయవాడలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘కరోనా’ లెక్కల గురించి వాస్తవాలను ప్రభుత్వం దాస్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు.

 రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సమాచార సేకరణ జరుగుతోందని, విదేశాల నుంచి వచ్చిన 28,622 మందిని గుర్తించామని, వీరిలో 15 మందికి పాజిటివ్ గా వచ్చిందని చెప్పారు. మిగిలిన వారిని నిర్బంధ పర్యవేక్షణలో ఉంచామని, 14 రోజుల హోం క్వారంటైన్ పూర్తి కావచ్చిందని చెప్పారు. అదే విధంగా, మర్కజ్ వెళ్లొచ్చి ‘కరోనా’ బారినపడ్డవారిలో 196 మంది ఉన్నారని, వీళ్లందరూ చికిత్స పొందుతున్నారని అన్నారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా 6175 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారని, వాళ్లందరిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉందని చెప్పారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు హైదరాబాద్ లో దాక్కుని, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.