ఏపీలో ‘కరోనా’ హాట్ స్పాట్ లను గుర్తిస్తున్నాం: ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి

07-04-2020 Tue 18:54
  • హాట్ స్పాట్ లలో ఆంక్షలు కఠినంగా అమల్లో ఉంటాయి
  • రాష్ట్ర స్థాయిలో 4 కోవిడ్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి
  • 260కి పైగా కేసులు మర్కజ్ కు వెళ్లొచ్చిన వారివే 

ఏపీలో ‘కరోనా’ హాట్ స్పాట్ లను గుర్తిస్తున్నామని, గుర్తించిన ఏరియాల్లో కఠినంగా ఆంక్షలు అమల్లో ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ర్యాపిడ్ టెస్టుల ద్వారా ‘కరోనా’ ఎంత మందికి వ్యాపించిందో తెలుస్తుందని, జిల్లాకు వంద నమూనాల చొప్పున సేకరించామని చెప్పారు. ఫిబ్రవరి 5 నాటికి కేవలం 90  మందికి మాత్రమే ‘కరోనా’ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉండేదని, ఇవాళ వెయ్యి మందికి పరీక్షలు నిర్వహించే స్థాయికి పెంచామని, మూడు వేల  నుంచి నాలుగు వేల మందికి పరీక్షలు నిర్వహించే స్థాయికి పెంచే ఆలోచనలో ఉన్నామని అన్నారు.  

రాష్ట్ర స్థాయిలో నాలుగు కోవిడ్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయని చెప్పిన జవహర్ రెడ్డి, ఈ ఆసుపత్రుల్లో మూడు షిఫ్టులలో మూడు బృందాలు పనిచేస్తున్నట్టు తెలిపారు. జిల్లాకు ఒక కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని చూస్తున్నామని అన్నారు. ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి రాష్ట్రానికి తిరిగొచ్చిన వారు వెయ్యి మంది వరకు ఉన్నారని చెప్పారు. మర్కజ్ కు వెళ్లినవారు, వాళ్లు కలిసిన వాళ్లతో సహా మొత్తం 3500 మంది నమూనాలు సేకరించామని చెప్పారు. ‘కరోనా’ పాజిటివ్ కేసులు 304 నమోదయ్యాయని, ఇందులో 260కి పైగా మర్కజ్ కి వెళ్లొచ్చిన వారేనని వివరించారు.