hydroxychloroquine: భారత్ లో క్లోరోక్విన్ మాత్రలకు కొరత లేదు, రానివ్వం: ఐపీఏ

  • కరోనా చికిత్సలో దివ్యౌషధంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్
  • విదేశాల నుంచి పెరుగుతున్న డిమాండ్
  • ప్రపంచదేశాలకు 70 శాతం క్లోరోక్విన్ ఎగుమతులు భారత్ నుంచే
IPA said no hydroxychloroquine shortage in country

కరోనా వైరస్ మృత్యుఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు యావత్ ప్రపంచం హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం పరితపిస్తోంది. మలేరియా చికిత్సలో ప్రధానంగా ఉపయోగించే క్లోరోక్విన్ మాత్రలు కరోనా చికిత్సలోనూ అమోఘంగా పనిచేస్తున్నట్టు వెల్లడి కావడంతో అన్ని దేశాల దృష్టి భారత్ పై పడింది. ప్రపంచంలో 70 శాతం హైడ్రాక్సీ క్లోరోక్విన్ సరఫరా భారత్ నుంచి జరుగుతుండడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయెన్స్ (ఐపీఏ) స్పందించింది.

దేశంలో కావల్సినంతగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ నిల్వలు ఉన్నాయని ప్రకటించింది. ఒకవేళ దేశీయ అవసరాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేయాల్సి వచ్చినా, భారీ స్థాయిలో క్లోరోక్విన్ మాత్రలను ఉత్పత్తి చేసేందుకు దేశీయ ఫార్మా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఉత్పత్తిని రెట్టింపు చేస్తామని ఐపీఏ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ తెలిపారు.

కరోనా చికిత్సలో క్లోరోక్విన్ సత్ఫలితాలు ఇస్తుండడంతో స్వదేశీ అవసరాల నిమిత్తం భారత్ మార్చి 25 నుంచి విదేశాలకు ఈ మాత్రల ఎగుమతిపై నిషేధం విధించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా క్లోరోక్విన్ కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో నిషేధాన్ని పాక్షికంగా సడలించాలని నిర్ణయించింది. క్లోరోక్విన్ ఎగుమతి చేయకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయంటూ ట్రంప్ బెదిరింపు స్వరం వినిపించినా, కేంద్ర ప్రభుత్వం మాత్రం వాస్తవికతతో వ్యవహరించాలని భావిస్తోంది.

More Telugu News