Assam: లాక్ డౌన్ ముగిశాక.. అసోం వచ్చే వారిని దశల వారీగా అనుమతిస్తామన్న ప్రభుత్వం!

  • ఇందుకు సంబంధించి ఓ వెబ్ సైట్ ను త్వరలోనే ప్రారంభిస్తాం
  • ముందుగా ఆ వెబ్ సైట్ ద్వారా వివరాలు తెలపాలి
  • ‘కరోనా’ లక్షణాలుంటే క్వారంటైన్ సెంటర్లకు పంపుతాం
  • అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ

దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్ డౌన్ ఏప్రిల్ 14 తో ముగుస్తుందని భావిస్తున్న అసోం రాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త నిర్ణయం తీసుకోనుంది. లాక్ డౌన్ కాల పరిమితి ముగిసిన అనంతరం తమ రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారితో పాటు ఆయా రాష్ట్రాల్లోని తమ పౌరులు ఇక్కడికి ప్రవేశించే విషయమై ఓ పర్మిట్ వ్యవస్థను ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

దశల వారీగా వారిని అనుమతించాలని భావిస్తున్నామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఓ వెబ్ సైట్ ను త్వరలోనే ప్రారంభిస్తామని, ఇక్కడికి రావాలనుకునే వాళ్లు ముందుగా ఆ వెబ్ సైట్ లో వారి వివరాలను పొందుపరుస్తూ దరఖాస్తు చేయాలని సూచించారు. లాక్ డౌన్ తర్వాత తమ రాష్ట్రానికి వచ్చే వారికి ఏమైనా కరోనా వైరస్ లక్షణాలున్నట్టు పరీక్షల్లో తేలితే వారిని క్వారంటైన్ సెంటర్లకు పంపుతామని అన్నారు.

ఒకవేళ తమ రాష్ట్రానికి వచ్చే వారిలో ఎవరైనా ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి ఉంటే కనుక ఆ సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. లేనిపక్షంలో విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసకుంటామని హెచ్చరించారు.

More Telugu News