Buggana Rajendranath: అమెరికా వంటి దేశాల్లో కూడా వైద్యులందరికీ పీపీఈ కిట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది: ఏపీ మంత్రి బుగ్గన

AP minister Buggana says US also lack of PPE kits
  • విపక్షాలు ప్రతిదానికీ విమర్శిస్తున్నాయని ఆరోపణ
  • తమ ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని వెల్లడి
  • ఓ సంఘటన కారణంగా ఏపీలో కేసులు పెరిగాయని వ్యాఖ్యలు
కరోనా వైరస్ పై పోరాటంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న వైద్యులకు పీపీఈ కిట్లు అందజేయాలని ప్రతి ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరుగుతోంది. ఈ అంశంపై ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో పీపీఈ కిట్ల కొరత ఉన్నా, తమ వద్ద ఉన్నంతవరకు అందిస్తున్నామని తెలిపారు.

అమెరికా వంటి దేశాల్లోనే డాక్టర్లందరికీ పీపీఈ కిట్లు, మాస్కులు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అన్నారు. కరోనాపై పోరుకు తమ ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని, వైద్య పరికరాల కొనుగోలుకు సీఎం జగన్ వెనుకడుగు వేయడం లేదని స్పష్టం చేశారు. విపక్షాలు ప్రతిదానికి విమర్శిస్తుండడం సరికాదని హితవు పలికారు.

ఏపీలో తొలుత తక్కువ కేసులే నమోదైనా, ఓ సంఘటన కారణంగా రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగిందని వివరించారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో కరోనా నిర్ధారణ కేంద్రాలను 4 నుంచి 7కి పెంచామని తెలిపారు.
Buggana Rajendranath
Corona Virus
PPE
Jagan
COVID-19
Andhra Pradesh

More Telugu News