ipl: ఐపీఎల్ జరగకపోవడం అవమానమే: ఇంగ్లండ్ క్రికెటర్ బట్లర్

  • ఈ టోర్నీకి చాలా ప్రాముఖ్యత ఉంది
  • లీగ్ లేకపోతే ఆటగాళ్లకు నష్టమే
  • ఆర్థికంగా కూడా భారీ నష్టం వస్తుందన్న ప్లేయర్  
Jos Buttler says its a big shame IPL

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడా పోటీలు నిలిచిపోయాయి. గత నెలలోనే మొదలవ్వాల్సిన ఐపీఎల్ ఈ నెల 15వ తేదీకి వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుడు కూడా మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో టోర్నీ రద్దవుతుందన్న వార్తలు వస్తున్నాయి. అయితే, కరోనా కారణంగా ఈ టోర్నీ జరగకపోవడం అనేది పెద్ద అవమానం అని ఇంగ్లండ్ క్రికెటర్ జోస్ బట్లర్ అభిప్రాయపడ్డాడు.

‘ఐపీఎల్ జరుగుతుందో లేదో అనే విషయంలో మీ అందరికంటే నాకు ఎక్కువ ఏమీ తెలియదు. కొంత మంది ఈ టోర్నీని తర్వాత నిర్వహించాలని చెబుతున్నారు. ఇప్పుడు పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. ఎన్ని రోజుల వరకు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు.  కాబట్టి టోర్నీ జరుగుతుందా? జరిగితే ఎప్పుడు? అని ఈ సమయంలో చెప్పలేం’ అని ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బట్లర్ అన్నాడు.

గత కొన్ని సీజన్లలో బ్యాటింగ్‌లో అదరగొట్టిన బట్లర్ ఈ మెగా లీగ్ ప్రాముఖ్యతను గుర్తు చేశాడు. లీగ్ జరగకపోతే ఆటగాళ్లకు నష్టమే అని, క్రికెట్ రెవెన్యూపై ప్రభావం పడుతుందని చెప్పాడు. ‘ఇది చాలా పెద్ద టోర్నీ. ఐపీఎల్‌తో ముడిపడి ఉన్న రెవెన్యూ కూడా చాలా అధికం. క్రికెట్‌లో ఇది చాలా పెద్ద టోర్నీ. ఈ టోర్నీ ముందుకు సాగకపోయినా, దీని కోసం షెడ్యూల్‌లో మార్పులు చేయకపోయినా అది సిగ్గుచేటే అవుతుంది’ అని బట్లర్ అభిప్రాయపడ్డాడు.

More Telugu News