లాక్ డౌన్ ముగుస్తుందని ఎయిర్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారా?.. అయితే ఇది చదవండి!

07-04-2020 Tue 16:38
  • కొత్త క్యాన్సిలేషన్ పాలసీ ప్రకారం డబ్బు రీఫండ్ కాదు
  • క్రెడిట్ కింద ఆ మొత్తాన్ని హోల్డ్ లో ఉంచుతారు
  • ఏడాది లోగా ఆ డబ్బుతో ఎప్పుడైనా ప్రయాణించవచ్చు
You may not get refund if you book air tickets

లాక్ డౌన్ ముగుస్తుందనే ఆలోచనతో ఏప్రిల్ 15 తర్వాత ప్రయాణాలు పెట్టుకున్నారా? ఎయిర్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారా? అయితే కాస్త జాగ్రత్త. లాక్ డౌన్ మరిన్ని రోజులు కొనసాగితే... మీరు బుక్ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నా.. ఆ డబ్బులు మీకు రీఫండ్ కాకపోవచ్చు.

లాక్ డౌన్ పై, విమాన ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా... ప్రైవేట్ ఎయిర్ లైన్స్ మాత్రం బుకింగ్స్ ప్రారంభించాయి. అంతేకాదు, ప్రమోషనల్ ఈమెయిల్స్ ను కూడా కస్టమర్లకు పంపుతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో జనాలు చిక్కుకుపోయారు. వీరంతా ఎయిర్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు.

అసలైన సమస్య అంతా ఇక్కడే ఉంది. కొత్త క్యాన్సిలేషన్ పాలసీ ప్రకారం... షట్ డౌన్ పొడిగింపు వల్ల విమాన సర్వీసులు పున:ప్రారంభం కాకపోతే... టికెట్ డబ్బులు రీఫండ్ చేయరు. ఆ డబ్బును క్రెడిట్ కింద హోల్డ్ లో ఉంచుతారు. ఏడాదిలోగా సదరు ప్రయాణికుడు ఎప్పుడైనా ఆ క్రెడిట్ డబ్బుతో ప్రయాణించవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు టికెట్లు బుక్ చేసుకున్నవారికి డబ్బులు వాపసు వచ్చే ప్రసక్తి లేదు.

ఈ సందర్భంగా ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలు లేకుండా ఎయిర్ లైన్స్ కంపెనీలు బుకింగ్స్ ను ప్రారంభించడం చాలా తప్పని అన్నారు. ఇప్పడు బుకింగ్ డబ్బు వెనక్కి రాకపోతే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారని చెప్పారు.