‘కరోనా’ కట్టడికి ప్రభుత్వాల కలిసికట్టు పోరాటానికి మహేశ్ బాబు ప్రశంసలు

07-04-2020 Tue 15:25
  • రెండు వారాలుగా లాక్ డౌన్... మనం మరింతగా  బలపడుతున్నాం’
  • ‘కరోనా’ కట్టడికి నిరంతరం శ్రమిస్తున్న యోథులకు ధన్యవాదాలు
  • ‘ఫేక్ న్యూస్’ కు, అలాంటివి సృష్టించే వారికి దూరంగా ఉండండి
Mahesh Babu tweets

రెండు వారాలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ తో మనం మరింతగా బలపడుతున్నామని, కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు కలిసికట్టుగా చేస్తున్న పోరాటాన్ని ప్రశంసిస్తున్నానని ప్రముఖ హీరో మహేశ్ బాబు అన్నారు. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అని, కరోనా మహమ్మారి కట్టడికి నిరంతరం శ్రమిస్తున్నవారికి, మనందరం ఎంతో ఆరోగ్యంగా ఉండటానికి కారకులైన వారికి ధన్యవాదాలు తెలుపుదామంటూ వరుస ట్వీట్లు చేశారు.

 ప్రస్తుత సంక్షోభ సమయంలో ఆసుపత్రుల్లో, వీధుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న యోధులందరిపై ఎంతో గౌరవం, ఆప్యాయత కనబరుస్తున్నామని, వాళ్లందరికీ దేవుడి దీవెనలు ఉండాలని ఆయన కోరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మహేశ్ బాబు ఓ సూచన చేశారు. సామాజిక దూరం, పరిశుభ్రత పాటించడం ఎంత ముఖ్యమో, ‘ఫేక్ న్యూస్’ నుంచి, అలాంటివి సృష్టించి భయపెట్టే వారి నుంచి దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని అన్నాడు. సానుకూలత, ప్రేమ, ఆశ.. వంటి వాటిని వ్యాప్తి చేయాలని ప్రతి ఒక్కరికి తాను విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.